జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష

Published: Thursday January 12, 2023
* ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ డానియల్ రత్నకుమార్
వికారాబాద్ బ్యూరో 11 జనవరి ప్రజాపాలన : జవహర్ నవోదయ విద్యాలయాలలో 6వ తరగతి ప్రవేశ పరీక్షకు ఈనెల 31వ తేదీ లోపు ఆన్ లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ డానియల్ రత్నకుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 29న నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.  అభ్యర్థులు ఏ జిల్లాలో నివసిస్తున్నారో  అదే జిల్లాలో పనిచేయుచున్న జవహర్ నవోదయ విద్యాలయాలో ప్రవేశానికై దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. 2022-23 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ,  ప్రభుత్వంచే గుర్తింపు పొందిన పాఠశాలలో 5వ తరగతి చదువుతూ ఉండాలని ఆయన వెల్లడించారు. పాఠశాలలలో  3, 4 తరగతులు పూర్తి విద్యాసంవత్సరాలు చదివి  ఉత్తీర్ణులై ఉండాలి. మే 1,  2011 నుండి ఏప్రిల్ 30,  2013 ( రెండు దినములు కలుపుకొని ) మధ్య జన్మించి ఉండాలని తెలిపారు.  జిల్లాలోని గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 75% సీట్లు కేటాయించబడతాయని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ,  ఎస్టీ,  ఓబీసీ,  దివ్యాంగులైన అభ్యర్థుల కొరకు రిజర్వేషన్లను వర్తింపచేయనున్నట్లు ఆయన అన్నారు.  ప్రత్యేకంగా బాలికల కోసం 33 శాతం సీట్లు కేటాయించబడుతుందని వివరించారు. జిల్లాలో సహవిద్య (కో ఎడ్యుకేషన్) ,  ఆదివాసీయ పాఠశాలలు ( రెసిడెన్షియల్ ) ఉంటాయని, బాల బాలికల కొరకు ప్రత్యేకమైన హాస్టల్స్ , ఉచిత విద్య , భోజన వసతి సదుపాయాలు ఉంటాయని ఆయన చెప్పారు. మైగ్రేషన్ పథకం ద్వారా విస్తృతమైన సాంస్కృతిక వినిమయం, క్రీడలు,  ఆటలతో పాటు ఎన్.సి.సి, స్కౌట్స్ అండ్ గైడ్స్ ,  ఎన్.ఎస్.ఎస్.లలో వృద్ధి పొందేలా శిక్షణలు ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు.