ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులపై సమీక్షా సమావేశం

Published: Saturday November 19, 2022
మేడిపల్లి, నవంబర్ 18 (ప్రజాపాలన ప్రతినిధి)
పీర్జాదిగూడ మున్సిపల్ కార్యాలయంలో వరంగల్ జాతీయ రహదారిపై నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులపై మేయర్ జక్కవెంకట్ రెడ్డి,కీసర ఆర్డీవో ఎన్.రవి, ట్రాఫిక్ ఎసీపీ శ్రీనివాసరావు, అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వరంగల్ జాతీయ రహదారిపై నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ పనులలో జరుగుతున్న తీవ్రమైన జాప్యం, నిర్మాణ సంస్థ నిర్లక్ష్యం కారణంగా మా ప్రాంత ప్రజల నిండు ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ప్రాజెక్టులో భూ సేకరణ, పరిహారం సమస్య లేనప్పుడు పనులలో జాప్యం ఎందుకు జరుగుతుందని కీసర ఆర్డీవో రవి అన్నారు. కారిడార్ పనులలో జరుగుతున్న జాప్యం కారణంగా నిత్యం తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యను అదుపు చేసేందుకు  సతమతం ఆవుతున్నామని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసరావు అన్నారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ.. ప్రభుత్వంతో పాటు పీర్జాదిగూడ పాలకవర్గం పూర్తిస్థాయిలో సహకరిస్తున్నప్పటికీ కారిడార్ నిర్మాణ పనులలో వేగం పెరగడం లేదని గాయత్రీ నిర్మాణ సంస్థ ప్రతినిధుల తీరుపై మేయర్ జక్క వెంకట్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఉప్పల్ నల్ల చెరువు నుంచి నారపల్లి వరకు రోడ్డపై ఏర్పడిన గుంతలను వెంటనే పూడ్చాలని, ఈ గుంతల కారణంగా రోడ్డు ప్రమాదాలు నిత్యాకృత్యం కావడం తో పాటు ఒకరిద్దరి ప్రాణాలు పోయాయన్నారు. అలాగే రోడ్డు ఇరుకుగా ఉండటం, గుంతలను పూడ్చని కారణంగా నిత్యం ట్రాఫిక్ జాం అవుతుందన్నారు. స్లాబ్ పనులు పూర్తయినంత వరకు ఆరులైన్ల రోడ్డును రెండు వైపులా విస్తరించాలని నిర్మాణ సంస్థ ప్రతినిధులను మేయర్ ఆదేశించారు. ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పించినప్పటికీ, పనులలో వేగం పెరగడం లేదని, కనీసం వరదనీరు వెళ్లేందుకు నిర్మించాల్సిన కల్వర్టు లను కూడా నిర్మించని కారణంగా చిన్నపాటి వర్షాలకే రోడ్డుపై నీరు అగుతుందన్నారు. వెంటనే వరదనీటిలైన్లు వేయాలని సూచించారు. పిల్లర్ నెంబర్ 117 దగ్గర, తులిప్స్ వద్ద, బంగారు మైసమ్మ గుడి వద్ద, బుద్ద నగర్ నుండి వచ్చే వరద నీటిని మళ్లించేందుకు కల్వర్టులు నిర్మించాలని మేయర్ సూచించారు. అలాగే బోడుప్పల్ రోడ్డులో హైటెన్షన్ టవర్ల ఎత్తును మరింత పెంచాలని మేయర్ అధికారులకు సూచించారు.
ఈ నెలాఖరు నాటికి రోడ్డు విస్తరణ పనులను పూర్తి చేయాలన్నారు. ఎలివేటెడ్ కారిడార్ పనులు పూర్తయితే పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రోడ్డుకు ఇరువైపులా బ్యూటిఫికేషన్ పనులు చేపట్టాల్సి ఉందన్నారు. సీపీఆర్ఐ నుంచి చెంగిచెర్ల వరకు దాదాపుగా కారిడార్ పనులు పూర్తయిన నేపథ్యంలో ఆ ప్రాంతంలో రెండు వైపుల ఆరులైన్ల రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని ప్రభుత్వ ఇంజనీరింగ్ అధికారులతో పాటు గాయత్రీ నిర్మాణా సంస్థ ప్రతినిధులను ఆదేశించారు.ఈ సమావేశంలో కార్పొరేటర్ భీంరెడ్డి నవీన్ రెడ్డి, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా డీఈ వెంకటేశ్వర్ రెడ్డి, పీఎంసీ డీఈ శ్రీనివాస్,మేనేజర్ జ్యోతి రెడ్డి, ఏఈ వినీల్ కుమార్,తహసీల్దార్ మహిపాల్ రెడ్డి, నేషనల్ హైవే అథారిటీ ఏఈ గోపికృష్ణ, కన్సల్టెంట్ టీం లీడర్ అనంత రెడ్డి, గాయత్రీ నిర్మాణ సంస్థ ప్రతినిధి శ్రీధర్, ఉప్పల్ ట్రాఫిక్ సీఐ మక్బుల్ జానీ తదితరులు పాల్గొన్నారు.