పర్యవేక్షణ పోస్టుల భర్తీ ద్వారా పాఠశాల విద్యారంగం బలోపేతం

Published: Monday July 18, 2022

ఎస్ టియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు

జగిత్యాల, జూలై 17 (ప్రజాపాలన ప్రతినిధి): ప్రభుత్వ పాఠశాల విద్యారంగంలో కీలకమైన  ప్రధానోపాధ్యాయులు,  మండల, జిల్లా విద్యాధికారి ల పోస్టులు పదోన్నతుల ద్వారా భర్తీ చేయడం ద్వారా ప్రభుత్వానికి  ఆర్థిక భారం లేకుండా, పర్యవేక్షణ పటిష్టంగా మారి  ప్రభుత్వ విద్యారంగం బలోపేతం అవుతుందని ఎస్ టియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బైరం హరికిరణ్, మచ్చ శంకర్ అన్నారు. ఆదివారం స్థానిక  ఎస్ టియు భవన్ లో జిల్లా శాఖ తృతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. ఇటీవల ప్రమాదంలో మరణించిన ఎ.టి.వి రిపోర్టర్ జమీరోద్దిన్ కు ఘన నివాళి అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత 7 సంవత్సారాలు గా పర్యవేక్షణ పోస్టులు భర్తీ కాక ప్రభుత్వ  పాఠశాల విద్యారంగం పూర్తిగా  నిర్వీర్యం అవుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. పదోన్నతుల ప్రక్రియ కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే లాభం  కాదు అని మొత్తం విద్యావ్యవస్థ బలోపేతానికి అని వివరించారు. వెంటనే బదిలీలు పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలని, ఉపాధ్యాయులకు జే.ఎల్ పదోన్నతులు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కచ్చు రాజన్న, జిల్లా ఆర్థిక కార్యదర్శి మేకల ప్రవీణ్, జిల్లా,  మండల నాయకులు చంద్రశేఖర్, రవీందర్, మచ్చెందర్, నరేష్, శ్రీనివాస్ ఉన్నారు.