గుంతలు తవ్వారు, పూడ్చడం మరిచారు,

Published: Saturday May 21, 2022
అధికారుల పనితీరు పై ప్రజల ఆందోళన
 
బెల్లంపల్లి మే 20 ప్రజా పాలన ప్రతినిధి:  బెల్లంపల్లి పట్టణంలోని పలు కాలనీల్లో  మిషన్ భగీరథ నీటి సరఫరా కోసం పైపులైన్లు వేసే క్రమంలో ఎంతో నాణ్యత గా ఉన్న,  బి టి రోడ్లను తవ్వి నాశనం చేశారని, నెలలు గడుస్తున్నా వాటిని పునర్నిర్మించటం లో కాంట్రాక్టర్లు గానీ, మున్సిపల్ అధికారులు గాని, పట్టించుకోక పోవడం వల్ల స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురవుతూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా స్థానిక కన్నాల బస్తీ మధునన్న నగర్ లో ఫ్లై ఓవర్ బ్రిడ్జి ప్రక్కన ఇటీవల మెగా కంపెనీ వారు మిషన్ భగీరథ పైప్ లైన్ వేయడం వల్ల నాశనం అయిపోయిన బీటీ రోడ్డును పునర్నిర్మించక పోవడం వల్ల, స్థానిక వ్యవసాయ మార్కెట్  గోదాములకు వెళ్ళే బారి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దుమ్ము ధూళి రేగుతూ స్థానిక నివాసాల్లోకి, దుమ్ము  చేరుతూ, శ్వాసకోశ వ్యాధులకు గురవుతూ స్థానిక ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా అదే రోడ్డుపైన " వై ఫై" కనెక్షన్ కోసమంటూ కేబులు వేయటానికని  గుంతలు తవ్వారని, నెలలు గడుస్తున్నా ,కేబుల్ వేయడం లేదు, గుంతలను పూడ్చడం లేదని, గుంతలను నడిరోడ్డు పైన త్రవ్వి అలాగే ఉంచడం వల్ల, ద్విచక్ర వాహనదారులు, పాదచారులు, రాత్రి వేళల్లో ఆ గుంటల్లో పడి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని, వెంటనే గుంతలను పూడ్చి వేయాలని, ఒకటో వార్డు లోని మధునన్న నగర్ ప్రజలు వాపోతున్నారు,
పాడైపోయిన రోడ్ల నిర్మాణం కోసం మరియు గుంతలను పూడ్చే విషయమై, స్థానిక వార్డు కౌన్సిలర్ సూరం సంగీత బానేష్ కు  పలు సార్లు విజ్ఞప్తి చేసిన, చూస్తాం ,చేస్తామని అంటున్నారే తప్ప, పనులు చేయడం లేదని, వారు ఆవేదన వ్యక్తం చేశారు.
 ఇప్పటికైనా రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని,
 సంబంధిత కాంట్రాక్టర్లు గాని, మున్సిపల్ కమిషనర్ గాని, పట్టించుకొని  నూతన రోడ్డు నిర్మించి, గుంతలను పూడ్చాలని  లేనిపక్షంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాలు చేపడతామని  వారు హెచ్చరించారు.
 
 
 
Attachments area