అతిథి గృహాన్ని ఆధునీకరించాలి

Published: Friday February 12, 2021

జిల్లా కేంద్రంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల పరిశీలన
15 లక్షల కలెక్టర్ నిధులతో చేపట్టిన పనులను పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ పౌసుమి బసు

వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 11 ( ప్రజాపాలన ) : అతిథి గృహాన్ని ఆధునీకరించాలని జిల్లా కలెక్టర్ పౌసుమి బసు సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని పాత అతిథి గృహం ఆధునీకరణ పనులు, కొత్త కలెక్టరేట్  కార్యాలయం, వైకుంఠధామం, డంపింగ్ యార్డ్ నిర్మాణపు పనులను కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ  15 లక్షల రూపాయల కలెక్టర్ నిధులతో చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అతిథి గృహాన్ని అందంగా తీర్చిదిద్దాలన్నారు.  జిల్లాకు వచ్చే ముఖ్య అతిధులు బస చేసేందుకు అనువుగా సుందరీకరణ పనులు చేపట్టాలన్నారు.  పరిసరాలలో ఉన్న పిచ్చి మొక్కలు, పేరుకుపోయిన చెత్తను తొలగించి అందమైన కొత్త మొక్కలు నాటాలన్నారు.  పెయింటింగ్, కొత్త విద్యుత్ దీపాలను అమర్చాలన్నారు.  పనులను వేగవంతం చేసి అతిధి గృహాన్ని ఆకర్షణీయంగా సిద్ధం చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ సిబ్బందిని ఆదేశించారు. పట్టణంలోని గంగారం వద్ద నిర్మాణంలో ఉన్న వైకుంఠధామం, డంపింగ్ యార్డ్ నిర్మాణపు పనులను కలెక్టర్ పరిశీలించారు.  కార్మికులను పెంచి బర్నింగ్ బెడ్స్, మరుగుదొడ్లు నిర్మాణాల పనులను పూర్తి చేయాలన్నారు.  గార్డెనింగ్ పనులు వెంటనే ప్రారంభించి మార్చి15 వరకు పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులకు, కాంట్రాక్టర్ కు ఆదేశించారు. డీఆర్సీ సెంటర్, కంపోస్ట్ షెడ్, వర్మీ కంపోస్ట్  షెడ్ ల నిర్మాణపు పనులను కలెక్టర్ పరిశీలించారు.  డంపింగ్ యార్డ్ లో రోడ్డు నిర్మాణపు పనులను వెంటనే చేపట్టాలని, మొక్కలు నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఏఈ  లు  అంజయ్య, లక్ష్మినారాయణ, రవికుమార్ లతో పాటు మున్సిపల్ కమీషనర్ భోగేశ్వర్లు, డీఈ రాంకిషన్, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.