అనంతగిరి దర్శిని స్పెషల్ బస్సు ప్రారంభం

Published: Wednesday May 18, 2022
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ బ్యూరో 17 మే ప్రజాపాలన :
అనంతగిరి దర్శిని స్పెషల్ బస్సును ప్రారంభించామని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం తక్కువ ఖర్చుతో హైదరాబాద్ కె.పి.హెచ్.బి నుంచి అనంతగిరికి  స్పెషల్ బస్సులు నడపడానికి ముందుకు వచ్చిన వికారాబాద్ ఆర్టీసీ యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు అని జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు.
మంగళవారం వికారాబాద్ బస్ స్టాండ్ లో అనంతగిరి దర్శిని స్పెషల్ బస్సును జిల్లా కలెక్టర్ నిఖిల ప్రారంభించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వికారాబాద్ జిల్లా అనగానే  అందరికీ ముందుగా గుర్తొచ్చేది అనంతగిరి కొండలు, కోటపల్లి ప్రాజెక్ట్, శ్రీ. అనంత పద్మనాభ స్వామి, బుగ్గ రామలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రాలని  దర్శించుకోవడానికి  ఆసక్తి చూపుతారని, ముఖ్యంగా వీకెండ్స్ లలో చాలా మంది ఎక్కువ ఖర్చుతో అనంతగిరికి వస్తుంటారన్నారు.  మరి కొంత మంది ఎలా వెళ్లాలో తెలియక ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారి కోసం అనంతగిరి దర్శిని స్పెషల్  బస్సును ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. ఆర్ టి సి లో తక్కువ ఖర్చుతో, సురక్షిత ప్రయాణం చేయవచన్ని, ఈ అవకాశాన్ని హైదరాబాద్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ రంగారెడ్డి ఉమ్మడి జిల్లా రిజినల్ మేనేజర్ సోలోమన్ రాజు మాట్లాడుతూ, అనంతగిరి దర్శిని స్పెషల్ బస్సు ప్రతి శని, ఆదివారాలు ఉదయం ఏడు గంటలకు హైదరాబాద్ లోని కె.పి.హెచ్.బి నుండి ప్రారంభమై అనంతగిరి కొండలకు చేరుకొని శ్రీ అనంత పద్మనాభ స్వామి దర్శనం అనంతరం బుగ్గ రామేశ్వర స్వామి దర్శనం చేసుకొని అనంతగిరి కొండలు వీక్షిస్తూ కోట్ పల్లి ప్రాజెక్టు వరకు ఈ బస్సు సౌకర్యం ఉంటుందని,  సాయంత్రం తిరిగి  7:00 గంటలకు మళ్లీ కె.పి.హెచ్.బి బస్టాండ్ లో దింపడం జరుగుతుందని తెలిపారు.  ఇందుకోసం పెద్దలకు రూ.300, పిల్లల రూ.150 చార్జి చేయబడుతుందని తెలిపారు. టూరిస్టులకు బస్సు సౌకర్యంతో పాటు భోజనం సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని, కానీ అట్టి ఖర్చులు టూరిస్టులే భరించాల్సి ఉంటుంది అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ మేనేజర్ జ్యోతి, డిపో మేనేజర్ మహేష్, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు తదితరులు పాల్గొన్నారు.