ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తే..అక్రమ కేసులా..? బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు

Published: Monday May 24, 2021
సిద్దిపేట, మే 23, ప్రజాపాలన ప్రతినిధి : రాష్ట్రంలోని టిఆర్ఎస్ ప్రభుత్వ పని తీరును ఎండగడుతూ ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్న బీజేపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సిద్దిపేటలో బిజెపి కార్యాలయంలో ఆదివారం జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే, తప్పును తప్పు అని ప్రతిపక్ష పార్టీలు మాట్లాడితే కేసులు పెడతాం అనే ధోరణిని మానుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హితవు పలికారు. సిద్దిపేట కరోన ఆసుపత్రిలో అవకతవకలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో, ఇతర ఛానల్ లో వచ్చిన వార్తలు తెలుసుకుని జిల్లా బీజేపీ మహిళ నేతలు ఆసుపత్రి సిబ్బంది అనుమతి తీసుకొని లోపలికి వెళ్తే సిబ్బంది మీద దాడి చేశారని అక్రమ కేసులు పెట్టడం జిల్లా పోలీసులు తగదని అన్నారు. పోలీసులు అక్కడ విచారణ చేసి, సీసీ కెమెరాల చూసి కేస్ పెట్టాలి, తప్పుడు పిర్యాదు చేసిన వాళ్లపై కేస్ పట్టాలి, కానీ బాధితులకు మనోదర్యం నింపడనికి వెళ్లిన వాళ్లపై కేస్ పెట్టడం పోలీస్ అధికారులు చేసిన మొదటి తప్పని ఎత్తి చూపారు. ఏడు సంవత్సరాల శిక్షకు కూడా పోలీసు స్టేషన్లో బెయిల్ ఇచ్చే అధికారం ఉన్నపటికీ పోలీసులు అత్యుత్సాహం తో కోర్టుకు పంపడం శోచనీయం అని పేర్కొన్నారు. ఇదే అత్యుత్సాహం కోవిడ్ వైద్య సేవల పట్ల ఉపయోగేస్తే బాగుండేదని ప్రభుత్వానికి హితవుపలికారు. ప్రతిపక్ష పార్టీలు గట్టిగా ఉంటేనే ప్రభుత్వం చేసే పని తీరు ప్రజలకు తెలుస్తుందని అన్నారు. సిద్దిపేట పోలీసులు, టీర్ఎస్ నాయకులు ప్రతిపక్షాల నోరు నొక్కే కార్యక్రమాలు మానుకోవాలని సూచించారు‌. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు చూసి రోజూ రోజుకు బీజేపీ పార్టీకి ఓట్ల శాతం పెరుగుతుందని జీర్ణించుకోలేక నాయకుల పై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎన్నో అవకతవకలు చేసి గెలిచిన మంత్రి హరీష్ రావు బిజెపి నాయకులను భయపెట్టాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇకనైనా బిజెపి నాయకులు, కార్యకర్తలపై కక్ష సాధింపు మానుకోవాలని మంత్రికి, పోలీసులకు రఘునందన్ రావు హితవు పలికారు. ధోరణి మారకపోతే ప్రత్యక్ష పోరాటానికి సిద్ధపడతామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో బిజెపి మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు గాడిపల్లి అరుణ రెడ్డి, పద్మ, శివ కుమార్ వేణు, మార్కండేయలు, వెంకటేశం, లింగం, వెంకట్, రాణి, బాలమణి తదితరులు పాల్గొన్నారు.