ఎల్ఐసిలో వాటాల ఉపసంహరణ తగదు

Published: Thursday January 20, 2022
మంచిర్యాల బ్యూరో‌, జనవరి 19, ప్రజాపాలన : స్వాతంత్రోద్యమ జాతీయ నాయకులు ఎంతో ముందు చూపుతో ప్రైవేటు కంపెనీలను ప్రభుత్వ పరం చేసి స్థాపించిన ఎల్ఐసిని నేడు బలహీనపరచాలని చూడడం తగదని వివిధ బీమా ఉద్యోగ సంఘాల నాయకులు పేర్కొన్నారు. బుధవారం రోజున మంచిర్యాల ఎల్ఐసి ఆఫీసు ఆవరణలో 66వ  బీమా జాతీయకరణ దినోత్సవం నిర్వహించారు. 1956 లో ఇదే రోజున ప్రైవేటు బీమా కంపెనీలను రద్దు చేస్తూ నాటి నెహ్రూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసి ఎల్ఐసి స్థాపనకు పూనుకున్నారని వారు పేర్కొన్నారు. గత 66 సంవత్సరాలుగా దేశ ప్రజల నమ్మకాన్ని నిలుపుకుంటూ.. ఎల్ఐసి సంస్థ వివిధ వర్గాల ప్రజలకు బీమారక్షణనందిస్తూనే, దేశ ఆర్థిక అభివృద్ధి లో సైతం కీలకపాత్ర పోషిస్తున్నదని వారు తెలిపారు. దేశం ప్రజల ప్రయోజనాల రక్షణ కోసం నిలబడిన సంస్థలను ప్రైవేటీకరించడం కార్పొరేట్ల పరం చేయడం ప్రజల ప్రయోజనాలకు విరుద్ధమని వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రజాభీష్టాన్ని మన్నించి మోడీ ప్రభుత్వం ఐపీఓ నిర్ణయాన్ని రద్దు చేసుకోవాలని వారు డిమాండు చేసారు. ఈ కార్యక్రమములో బీమా ఉద్యోగుల సంఘం నాయకులు  ఎం.రామదాసు, ఎ.తిరుపతిరెడ్డి, ఆర్. రాజేశం, వికాసాధికారుల సంఘం నాయకులు ఫణిరామ్మోహన్, సతీష్ కుమార్. బీమా అధికారుల సంఘము నాయకులు ఉమాశంకర్, సడగోపన్, ఏజెంట్ల సంఘం నాయకులు, తిరుపతయ్య, మల్లారెడ్డి, లింగమూర్తి, రవీందర్,  శ్రీనివాస్, చరణ్  తదితరులు పాల్గొన్నారు.