ప్రభుత్వ ఉపాధ్యాయులుపాఠశాలల బలోపేతం కోసం కృషి చేయాలి

Published: Friday June 17, 2022
మధిర రూరల్ జూన్ 16 ప్రజా పాలన ప్రతినిధిప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని మండల విద్యాశాఖ అధికారి వై ప్రభాకర్ కోరారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా గురువారం మధిర మున్సిపాలిటీ పరిధిలోని జిలుగుమాడు ప్రాథమిక పాఠశాలలో విద్యా కమిటీ సమావేశం పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాణి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలను తీర్చి దిద్దడంలో విద్యాకమిటీ ప్రధానభూమిక వహించాలని, ఎక్కువ మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరే విధంగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యాకమిటీ సభ్యులందరూ కలిసి పని చేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వం కల్పించే ఉచిత సౌకర్యాలను ప్రతి ఇంటికివెళ్లి తెలియజేస్తూ వారి పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చేరే విధంగా కృషి చేయాలని ఆయన కోరారు. అనంతరం జిలుగుమాడు గ్రామస్తులు మరియు రైల్వే ఉద్యోగి ఐనటువంటి దోర్నాల కొండలరావు ఆర్థిక సహాయం చేసిన యాభై వేల రూపాయలతో  పాఠశాలలో త్రాగునీటి సౌకర్యం, రంగులు, వాల్ రైటింగ్ తదితర పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు పాఠశాల అభివృద్ధి కోసం ఆర్థిక సహాయం చేసిన దోర్నాల కొండలరావుని ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎంసి వైస్ చైర్మన్, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు కొటారి రాఘవరావు, పాఠశాల ఉపాధ్యాయులు మేడేపల్లి నాగమణి, సాంబయ్య లతోపాటు విద్యా కమిటీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.