బిజెపి కుట్ర పూరితంగానే రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వం రద్దు

Published: Saturday April 01, 2023
* భారత్ జోడో పాదయత్రతో బిజెపి వెన్నులో వణుకు
* మూలనపడ్డ కేసును తవ్వి తీశారు
* మీడియా సమావేశంలో మాజీ మంత్రి కొండాసురేఖ
వికారాబాద్ బ్యూరో 31 మార్చి ప్రజాపాలన : రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్రతో భారతీయ జనతా పార్టీ నాయకులలో వణుకు పుట్టిందని మాజీ మంత్రి కొండా సురేఖ ఘాటుగా విమర్శించారు. మూలన పడ్డ పాత కేసును తవ్వి కుట్రపూరితంగా రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయించడం అవివేకం అని ధ్వజమెత్తారు. శుక్రవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని సాకేత్ నగర్ లో గల మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ నివాసంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్థ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పరిగి మాజీ ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని అధికారానికి దూరం చేయడమే లక్ష్యంగా బిజెపి కుట్రలు పన్నుతుందని ఘాటుగా స్పందించారు. రాహుల్ గాంధీ పట్ల ప్రజాదరణ పెరుగుతుండడంతో బిజెపి అధినాయకత్వంలో భయం పట్టుకుందని స్పష్టం చేశారు. నీరవ్ మోడీ లలిత్ మోడీ నరేంద్ర మోడీ చట్టపట్టలేసుకొని ఆర్థిక దోపిడీలో తమ వంతు పాత్ర పోషించడంలో ఒకరిని మించి మరొకరు ఎదిగారన్నారు. పలు కార్పొరేట్ సంస్థలన్నీ నీరుగార్చి అదానికి ధార పోసిన నరేంద్ర మోడీ రాజకీయ పతనానికి నిదర్శనమని అన్నారు. దేశం కోసం ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగాలు చేశారని కొనియాడారు. గాంధీ కుటుంబం అంటేనే నీతికి నిజాయితీకి మరో పేరు అని గుర్తు చేశారు. దేశాన్ని అవిచ్ఛిన్నం కాకుండా కాపాడడంలో కాంగ్రెస్ పార్టీని మించిన పార్టీ ఏది లేదని ఘంటాపథంగా చెప్పారు. విపక్షాలు ఆరోపణలు చేస్తే వాటిని సద్విమర్శగా తీసుకొని ఏ తప్పు చేయలేదని అధికారపక్షం నిరూపించుకోవాలని సూచించారు. ప్రజాస్వామికంగా ప్రశ్నించే గొంతులను నొక్కి పట్టాలన్న ఆలోచన మూర్ఖత్వమని విమర్శించారు. అధికార పక్షానికి ప్రశ్నించే విపక్షం గట్టిగా ఉంటేనే ప్రజాస్వామ్యం బతికి బట్ట కడుతుందని అన్నారు. చట్టబద్ధంగా ప్రశ్నించే గొంతును నొక్కితే ప్రజా కోర్టులోనే తేల్చుకుంటామని హెచ్చరించారు. ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు తప్పించే కాంగ్రెస్ పార్టీ చరిత్ర చాలా గొప్పది అన్నారు. ఈ కార్యక్రమంలో శివారెడ్డి పెట్ పిఎసిఎస్ మాజీ చైర్మన్ కిషన్ నాయక్ జిల్లా అధ్యక్షుడు జగ్గరి రత్నారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ జైదుపల్లి మురళి సీనియర్ కాంగ్రెస్ నాయకులు కామిడి కమాల్ రెడ్డి కామిడి అనంత రెడ్డి రెడ్యా నాయక్ యువ నాయకులు సతీష్ రెడ్డి సంతోష్ గౌడ్ చాపల శ్రీనివాస్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.