కేటీఆర్, ప్రజాప్రతినిధుల సమక్షంలొ బాబు జ‌గ్జీవ‌న్ రామ్ ఫ్లై ఓవ‌ర్‌ ప్రారంభించిన కార్మికురా

Published: Wednesday July 07, 2021
కూకట్ పల్లి: (ప్రజాపాలన) బాలనగర్ నర్సాపూర్ చౌరస్తాలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో రూ.387 కోట్లతో 1.13 కిలోమీటర్ల మేర ఆరు లేన్లతో నూతనంగా నిర్మించిన ఫ్లై ఓవర్ ను మంగళవారం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేసి గత రెండేళ్లుగా ప్రాజెక్టులో పని చేసిన కార్మికురాలు శివమ్మ చేతుల మీదుగా మంత్రులు మల్లారెడ్డి గ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీలు పివి సురభీ వాణి దేవి, శంభీపూర్ రాజు, నవీన్ రావు, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణా రావు, కేపి వివేకానంద్, మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, డిప్యూటీ మేయర్ లత శోభన్ రెడ్డి తో కలిసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ బాలన‌గ‌ర్ ప్రజల 40 సంవ‌త్స‌రాల క‌ల నెర‌వేరిందని అన్నారు. ట్రాఫిక్ స‌మ‌స్య‌తో నిత్యం బాలాన‌గ‌ర్ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఈ రోడ్డు ద్వారా వెళ్లేవారికి క‌నీసం 30 నిమిషాల ‌పాటు ట్రాఫిక్ ఇబ్బందులు త‌ప్ప‌లేదని అన్నారు. ఇప్పుడు ఈ ఫ్లై ఓవ‌ర్ అందుబాటులోకి రావ‌డంతో ట్రాఫిక్ క‌ష్టాలు పూర్తిగా తొలగిపోతాయని చెప్పారు. అదే విధంగా బాలాన‌గ‌ర్ ఫ్లై ఓవ‌ర్‌కు బాబు జ‌గ్జీవ‌న్ రామ్ ఫ్లై ఓవ‌ర్‌గా నామ‌క‌ర‌ణం చేయాలని ప్రజల నుండి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఆ పేరునే ఖరారు చేస్తున్న‌ట్లు మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అందుకు సంబంధించి అతి త్వ‌ర‌లోనే ఉత్త‌ర్వులు జారీ చేస్తామ‌న్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత ఎస్ఆర్డీపీ (వ్యూహాత్మ‌క రోడ్ల అభివృద్ది ప్ర‌ణాళిక‌) ద్వారా ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా వేల కోట్లతో ఫ్లై ఓవ‌ర్లు, అండ‌ర్ పాస్‌లు నిర్మిస్తున్నామని అన్నారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ సంయుక్తంగా క‌లిసి బ్ర‌హ్మాండ‌మైన అభివృద్ధి ప‌నులు చేప‌ట్ట‌డం జ‌రుగుతుంద‌న్నారు. తెలంగాణలో లక్షలాది మంది కార్మికులు మన ప్రాజెక్టుల్లో నిమగ్నమై పని చేస్తున్నారని, వారిని గౌరవించుకోవలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా ఈరోజు ఈ ప్రాజెక్టులో గత రెండు సంవత్సరాలుగా పని చేసిన వనపర్తి జిల్లాకు చెందిన శివమ్మ అనే కార్మికురాలి చేతుల మీదుగా ఫ్లై ఓవర్ ను ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎండిఏ అధికారులు బిఎం సంతోష్ (ఐఎఎస్), బిఎల్ఎన్ రెడ్డి, జోనల్ కమిషనర్ మమత, స్థానిక కార్పొరేటర్లు పండాల సతీష్ గౌడ్, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.