ప్రజల భాగస్వామ్యంతో పల్లెలు పచ్చగా పరిశుభ్రంగా మారాలి

Published: Monday June 06, 2022
 వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ యూరో 05 జూన్ ప్రజాపాలన : 
గ్రామాలు పచ్చగా, పరిషభ్రంగా  ఉండాలంటే ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు. 5వ విడత పల్లె ప్రగతి   కార్యక్రమంలో భాగంగా  ఆదివారం పరిగి మండలం చిగురాల్ పల్లి గ్రామంలో ప్రజలతో కలిసి  కలియతిరిగారు.  మన ఊరు మన బడి  కార్యక్రమంలో భాగంగా ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో 23 లక్షల వ్యయంతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు పరిగి శాసన సభ్యులు కొప్పుల మహేశ్వర్ రెడ్డి, ప్రజా ప్రతినిధులతో కలిసి శంకుస్థాపన గావించారు. మంజూరు అయిన నిధులతో అదనపు గది,  పాఠశాల, విద్యుత్తు మరమత్తులతో పాటు నీటి సరఫరాకు ఉపయోగిస్తారు.  అంతకుముందు పాఠశాల ఆవరణలో గల సరస్వతి విగ్రహం వద్ద నిర్వహించిన పూజా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.  బడి బాట కార్యక్రమంలో భాగంగా కొందరు పిల్లలను బడిలో చేర్పించడం జరిగింది. పల్లె ప్రగతి సందర్భంగా రైతు వేదిక ప్రాంగణంలో ఏర్పాటుచేసిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలో  ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపడుతూ మన స్వంత ఇల్లు మాదిరిగా గ్రామాన్ని  తీర్చిదిద్దుకోవాలని ప్రజలకు హితవు పలికారు.  ప్రతి ఒక్కరి ఇంటి ముందు మొక్కలు నాటినట్లయితే గ్రామం పూర్తిగా పచ్చదనంతో నిండి పోతుందని, దీన్ని ప్రతి ఒక్కరూ  తమ  బాధ్యతగా గుర్తించాలని కోరారు. గ్రామాల అభివృద్ధిలో భాగంగా త్రాగునీరు,  విద్యుత్తు వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందని ఆమె తెలిపారు. పల్లె ప్రగతి లో భాగంగా సమస్యలను గుర్తించేందుకు  ఒక రిజిస్టర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని అందులో సత్వరమే చేయవలసిన పనులు ఏమైనా ఉంటే వాటిని త్వరితగతిన పూర్తి చేసేందుకు వీలు ఉంటుందని ఆమె అన్నారు. 
పల్లె ప్రగతిలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడంతో  పాటు వివిధ సమస్యలు పరిష్కరించడం జరుగుతుందన్నారు. తడి చెత్త , పొడి చేత్త వేరు చేసి పారిశుధ్య కార్మికులకు అందించి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మురికి నీరు రోడ్లపై ప్రవహించకుండా తగు జాగ్రత్తలు  తీసుకోవాలన్నారు. ప్రతి ఇంటి ముందు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ కోరారు. గ్రామంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు స్థలాన్ని గుర్తించి చుట్టూ కంచె వేసి పచ్చదనంగా ఉండేలా మొక్కలను పెంచాలని తెలిపారు. గ్రామాల్లో నిర్మించుకున్న మరుగుదొడ్లను అందరూ వాడుకోవాలని అప్పుడే గ్రామ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయని ఆమె అన్నారు.  ప్రతి ఒక్కరూ మిషన్ భగీరథ నీటిని తాగాలని, నేను అదే నీటిని తాగుతానని కలెక్టర్ అన్నారు. భగీరథ నీటిని తాగడం వల్ల ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేకూరుతుందని తెలిపారు.  మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులను నెలలో మూడు మార్లు తప్పనిసరిగా శుభ్రం చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కోరిక మేరకు మిగిలిపోయిన చిగురాల్ పల్లి గ్రామ రోడ్డు పనులకు కావలసిన నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. పరిగి శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి మాట్లాడుతూ  పల్లె ప్రగతి  ద్వారా  పల్లెలు కూడా పట్టణాలుగా అభివృద్ధి చెందాలని సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని అన్నారు. ప్రతి గ్రామము అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో జనాభా ప్రాతిపదికన గ్రామ పంచాయతీలకు ఎన్నడూ లేని విధంగా నిధులను కేటాయించడం జరుగుతుందని అన్నారు ప్రజలు తీసుకున్న నిర్ణయాల మేరకే కావలసిన పనులను చేపట్టడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో పరిశుభ్రంగా ఉండాలని ఉద్దేశంతో డంపింగ్ యార్డులను ఏర్పాటు చేసి చెత్తను చేరవేసేందుకు ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్లను అందజేయడం జరిగిందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం  చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల్లో ఏదో ఒక రకంగా ప్రతి ఇంటికి చేరిందని తెలిపారు. విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకు వస్తూ ఏ చిన్నారి కూడా చదువుకు దూరం కాకూడదని బడి బాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అన్ని మౌలిక సదుపాయాలతో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఆంగ్ల మాధ్యమంలో విద్యను అందించుటకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆయన పేర్కొన్నారు. చిగురాల్ పల్లి గ్రామానికి  యాభై లక్షల వ్యయంతో సిసి రోడ్ నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందని, ఇంకా కొంత భాగం రోడ్డు పనులు చేపట్టాల్సి ఉందని దీనికి జిల్లా కలెక్టర్ కొంత నిధులు కేటాయించినట్లు అయితే మిగతా పనులు పూర్తి చేస్తామని,  నిధుల మంజూరుకై  ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ ను కోరారు. తదనంతరం చిగురాల్ పల్లి గ్రామ రోడ్డు సరిహద్దులో జిల్లా కలెక్టర్ , ఎమ్మెల్యే స్థానిక ప్రజాప్రతినిధుల కలిసి మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ కరణం అరవింద్ రావు,  జడ్పిటిసి హరిప్రియ ప్రవీణ్ రెడ్డి,  సర్పంచ్ వెంకటయ్య, పల్లె ప్రగతి ప్రత్యేక అధికారి ఉపేందర్, డిఇఓ రేణుక దేవి, డిపిఓ మల్లారెడ్డి, తాసిల్దార్ రాంబాబు, ఎంపీడీఒ శేషగిరి శర్మ ,  ఎంఈఓ ఎం. హరిచంద్ర,  ప్రధానోపాధ్యాయులు  రాజేష్ రాథోడ్, ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.