ప్రపంచంలోనే గొప్పది భారత రాజ్యాంగం.. జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి

Published: Thursday January 27, 2022

మంచిర్యాల బ్యూరో‌, జనవరి 26, ప్రజాపాలన : ప్రపంచంలోనే అతి గొప్పది భారత రాజ్యాంగం అని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. బుధవారం భారత 73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన ప్రాంగణంలో వేడుకలను నిర్వహించారు. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత కొవిడ్ విపత్కర పరిస్థితులలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో నిరాడంబరంగా వేడుకలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. జాతీయ భావాన్ని గుండెల నిండా నింపుకుని దేశ అభివృద్ధి, సంక్షేమంలో భాగస్వాములు కావలసిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉందని అన్నారు. కొవిడ్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ సూచనల మేరకు హంగు ఆర్భాటాలకు లేకుండా వేడుకలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. భారత రాజ్యాంగం నిబంధనలకు అనుగుణంగానే ప్రతి కుటుంబానికి సంక్షేమాభివృద్ధి ఫలాలు అందించేందుకు ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని అన్నారు, కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాల వారు సర్వతోముఖాభివృద్ధి సాధించాలన్నదే ప్రభుత్వ అభిమతమని అన్నారు. భారత రాజ్యాంగ స్ఫూర్తిని దశదిశలా వ్యాపింపజేస్తూ, రాజ్యాంగ ఫలాలు అట్టడుగు స్థాయి వరకు అందరికి అందేలా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, ట్రైనీ కలెక్టర్ ప్రతిభా సింగ్, అన్ని శాఖల జిల్లా అధికారులు, పలువురు పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.