రైతు సంఘం జిల్లా మహాసభను జయప్రదం చేయండి : సిపిఐ జిల్లా నాయకులు తోట రామాంజనేయులు

Published: Friday November 26, 2021
బోనకల్, నవంబర్ 25 ప్రజాపాలన ప్రతినిధి : మండల కేంద్రంలో తొలిసారిగా జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం (ఏఐకెఎస్) జిల్లా 20వ మహాసభలను జయప్రదం చేయాలని ఆహ్వాన సంఘ అధ్యక్షులు తోట రామాంజనేయులు పిలుపునిచ్చారు. మండలంలో పలు గ్రామాల్లో పర్యటించిన అనంతరం మోటమర్రిలో జరిగిన ఆహ్వాన సంఘ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1953వ సంవత్సరంలో ఖమ్మం వరంగల్ జిల్లా నుండి విడిపోయిన తర్వాత 1956వ సంవత్సరంలో నాగులవంచ గ్రామంలో మొట్టమొదటి ఉమ్మడి జిల్లా మహాసభ జరిగిందని మరల అరవై ఐదు సంవత్సరాల తరువాత మధిర నియోజకవర్గం లోని బోనకల్ మండల కేంద్రంలో ఈ మహాసభలు జరగటం సంతోషకరమైన విషయం అన్నారు. నియోజకవర్గంలోని ప్రజలు రైతులు అనునిత్యం ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాల్లో పాలుపంచుకున్న చరిత్ర ఉందన్నారు. గత అయిదు దశాబ్దాలుగా చైతన్యం తో కమ్యూనిస్టులకు అండగా ఉంటున్న ఈ ప్రాంతంలో రైతు మహాసభలు జరుగుతున్న సందర్భంగా ప్రజలు రైతులు తమ పూర్తి సహాయ సహకారాలు అందించి జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆహ్వాన సంఘ ప్రధాన కార్యదర్శి యంగల ఆనందరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి తూము రోషన్ కుమార్, సహాయ కార్యదర్శి బుర్రి నాగేశ్వరరావు, కోశాధికారి జక్కుల రామారావు, మీడియా కార్యదర్శి ఆకెన పవన్ తదితరులు పాల్గొన్నారు.