వికారాబాద్ బిఆర్ఎస్ లో భగ్గుమన్న వర్గపోరు

Published: Wednesday March 29, 2023
* వడ్ల నందు వర్గం, ఎమ్మెల్యే ఆనంద్ అనుచరుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం
* పోలీసుల రంగప్రవేశంతో సద్దుమణిగిన గొడవ
వికారాబాద్ బ్యూరో 28 మార్చి ప్రజాపాలన :  వికారాబాద్ నియోజకవర్గంలోని బిఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులు వడ్ల నందు, రాష్ట్ర విద్యా మౌలిక వసతుల కల్పన సంస్థ మాజీ చైర్మన్, బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి నాగేందర్ గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సనగారి కొండల్ రెడ్డి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సామల రాంచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం వికారాబాద్ లోని నాగేష్ గుప్తా ఉద్యాన వనంలో మంగళవారం ఏర్పాటు చేసుకున్నారు. వికారాబాద్ మున్సిపల్ ఏర్పడి రెండున్నర సంవత్సరాలు అయిన సందర్భంగా నియోజకవర్గస్థాయి ఉద్యమకారులందరూ కూర్చొని మాట్లాడు కొనుచుండగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే  ఆనంద్ వర్గం అక్కడికి చేరుకొని స్థానిక ఎమ్మెల్యే , జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆనంద్ కు సమాచారం లేకుండా ఎందుకు సమావేశం నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే వర్గం ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనితో ఇరు వర్గాల మధ్య మాట మాట పెరిగి ఒకరికొకరు నెట్టుకునే వరకు వెళ్ళింది. దీనితో వికారాబాద్ డీఎస్పీ సత్యనారాయణ ముగ్గురు సీఐలతో అదనపు బలగాలతో రంగ ప్రవేశం చేశారు. ఇరు వర్గాలకు నచ్చచెప్పి గొడవలకు కారణమైన స్థలాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవాలని హుకుం జారీ చేశారు. పోలీసులతో ముందు బయటికి వాళ్ళని పంపియండి అని ఎమ్మెల్యే వర్గం, వారినే పంపియాలని నందు వర్గం కొంతసేపు వాగ్వివాదానికి దిగారు. చేసేది ఏమీ లేక భోజనాలు చేస్తున్న వడ్ల నందు వర్గాన్ని సైతం భోజనాలు చేయకుండా బయటకి వెళ్లాలని డి.ఎస్.పి ఆదేశాలు ఇవ్వడంతో దిక్కుతోచని స్థితిలో వడ్ల నందు వర్గం అక్కడి నుండి కెసిఆర్ జిందాబాద్, కేటీఆర్ జిందాబాద్, బి ఆర్ ఎస్ జిందాబాద్ మహేందర్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ బయటకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఎమ్మెల్యే వర్గం అనుచరులు ఎమ్మెల్యే జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ బయటకి వెళ్ళిపోయారు. దీనితో నగేష్ గుప్తా గార్డెన్ దగ్గర వాతావరణం చల్లబడింది. దీనితో పోలీసులు ఊపిరి పీల్చుకున్నట్లు అయింది.