*శ్రీరామ కళ్యాణంకై విస్తృత ఏర్పాట్లు*

Published: Wednesday March 29, 2023
మంచిర్యాల టౌన్, మార్చి 28, ప్రజాపాలన: మంచిర్యాల పట్టణంలోని గౌతమినగర్లో గల శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నామని ఆలయ కమిటీ చైర్మన్ సిరిపురం రాజేశ్ అన్నారు . ఈ మేరకు దేవాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు . ఈ నెల 29 న స్వామి వారి ఉత్సవ మూర్తులతో తమ నివాసం నుండి ఎదుర్కోలు కార్యక్రమం ఉంటుందని , అనంతరం ప్రత్యేకమైన రథంలో గౌతమినగర్ పురవీధుల గుండా స్వామివారి శోభయాత్ర ఉంటుందని అన్నారు . 30 వ తేదీన అభిజిత్ లఘ్న శుభ ముహూర్తములో మధ్యాహ్నం 12.30 గం॥లకు వేలాది మంది భక్తుల సమక్షంలో లోకకళ్యాణార్ధమై వేదబ్రాహ్మణులచే శ్రీసీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా జరుగనుందని అన్నారు . కళ్యాణం వెనువెంటనే వుడెం వెంకటస్వామి ఆధ్వర్యంలో దాదాపు 10 వేల మంది భక్తులందరికీ మహా అన్నప్రసాద వితరణ ఉంటుందని అన్నారు . ఈ నెల 31 వ తేదీన ఉదయం 10 గం॥లకు శ్రీ సీతారామచంద్రస్వామి వారి పట్టాభిషేకము , దాతలకు సన్మాన కార్యక్రమాలు ఉంటాయని అన్నారు . భక్తులు స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి అధిక సంఖ్యలో పాల్గొని స్వామి కృపకు పాత్రులు కావలసినదిగా కోరారు .
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మెట్టుపల్లి కిషన్రావు , కోటిచింతల నరేందర్రావు , అంకం చంద్రయ్య , కల్వల జగన్మోహన్రావు , సిరికొండ పద్మ - కొండల్రావు , నాంపల్లి మాధవి - శ్రీనివాస్ , బోయినపల్లి రాంగోపాల్రావు తదితరులు పాల్గొన్నారు.