ప్రజా పాలన కావాలా? నిరంకుశ పాలన కావాలా?:ప్రొఫెసర్ కోదండరాం

Published: Friday February 05, 2021
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు, ఉద్యోగులు, పట్టభద్రులు, ప్రజా పాలన కావాలో నిరంకుశ పాలన కావాలో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని ప్రొఫెసర్ కోదండరామ్ పేర్కొన్నారు. గురువారం మధిరలో ప్రొఫెసర్ జయశంకర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు ప్రభుత్వ పాఠశాలల్లో, కార్యాలయాల్లో, ప్రైవేట్ విద్యాసంస్థల్లో, ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎన్నికలు నిరంకుశత్వానికి,  నిబద్ధతకు మధ్య జరిగే ఎన్నికలన్నారు. ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఉద్యోగులు, నిరుద్యోగుల తరఫున తాను ప్రశ్నించే గొంతుక అవుతానని ఆయన అన్నారు. చట్టసభల్లో రాజ్యాంగపరమైన హక్కుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ఉద్యోగులు,  పట్టభద్రులు తనకు మొదటి ప్రాధాన్యత ఓటు ఇవ్వాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేసి, సొంత ప్రయోజనాల కోసం పని చేస్తుందని, ఆయన విమర్శించారు. రాష్ట్రంలో 1.90 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందా?  లేదా? అని ప్రశ్నించారు. పట్టభద్రుల  ఎన్నికల్లో మనం గెలిస్తే ప్రజా పాలన, అధికార పార్టీ వారు గెలిస్తే నిరంకుశ పాలన వస్తుందన్నారు. సమాన పనికి సమాన వేతనం కల్పించాలని సుప్రీంకోర్టు చెప్తున్నప్పటికీ ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయటం లేదన్నారు. రెగ్యులర్ ఉద్యోగులకు సెంట్రల్ గవర్నమెంట్ స్కేల్ ఇస్తామన్న ప్రభుత్వం, కనీసం పిఆర్సి కూడా ఇవ్వలేక పోయిందని ఆయన ఆరోపించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలన్నారు. పిఆర్సి రిపోర్ట్ ఉద్యోగులను నిరాశా నిస్పృహలకు గురి చేసిందన్నారు. ఇప్పటికైనా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగులకు పిఆర్సి పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పేరుతో  కాంట్రాక్టర్లకు రాష్ట్ర సంపదని దోచి  పెడుతుందని ఆయన విమర్శించారు.  సొంత అవసరాలకోసం ప్రజల అవసరాలను నిర్లక్ష్యం చేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే రాజ్యాంగపరమైన హక్కులను కాపాడుకుంటూ, నిబద్ధత ఉంటే నాయకులను చట్టసభలకు పంపాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ కన్వీనర్ మనోహర రాజు జిల్లా యూనియన్ నాయకులు తాళ్లూరు వేణు, న్యూ డెమోక్రసీ నాయకులు కే అర్జున్ రావు, టీజేఎస్ నాయకులు గోపగాని శంకర్రావు, టి పి టి ఎఫ్ ప్రధాన కార్యదర్శి విజయ్ పలువురు ఉపాధ్యాయులు పట్టభద్రులు పాల్గొన్నారు.