నాన్నల దినోత్సవం సందర్భంగా.. తన కొడుకుతో కొన్ని విషయాలు

Published: Monday June 21, 2021
ఒక రోజు ఒక పిల్లాడు తన నాన్నతో కలిసి జాతరకు వెళ్ళాడు. జాతరంతా తిప్పి చూపించి కొడుకును సంతోషపరచాలని నాన్న ఆలోచన. జాతరలో మంచి మంచి బొమ్మలు, వస్తువులు కొనుక్కుని తన స్నేహితులకు చూపించి నాన్న కొనిచ్చాడని గొప్పగా చెప్పుకొని ఆనందం పొందాలని కొడుకు ఆలోచన. పుత్రునికి జాతర విశేషాలు వివరిస్తూ మెల్లగా నడుస్తున్నాడు నాన్న. జాతరంతా తిప్పుతున్నాడు గాని, నాన్న ఇంకా తనకి బొమ్మలు కొనిపెట్టడంలేదని మనసులోనే అనుకుంటూ ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు పిల్లాడు. తన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బుతో ఏమి కొనివ్వగలనా అని ఆలోచిస్తున్నాడు నాన్న. ఇంతలో పిల్లాడికి ఒక బొమ్మ నచ్చి దాన్ని కొనిమ్మన్నాడు. జేబులో ఉన్న డబ్బు ఆ బొమ్మ కొనడానికి సరిపోదని అర్థమైన నాన్న "ఇంకొకటి కొందాం, పద ముందుకు" అంటూ పిల్లాడిని జాతరంతా తిప్పుతున్నాడు నాన్న. పిల్లాడికి నచ్చిన బొమ్మలు కొనలేని తన బలహీనస్థితికి మనసులోనే తిట్టుకుంటూ, తన దగ్గర ఉన్న డబ్బుతో ఏ బొమ్మ కొనగలనా అని వెదుకుతున్నాడు నాన్న. జాతరలో కనిపించిన బొమ్మలన్ని కొనేస్తే బాగుంటుంది కదా అని ఆలోచిస్తున్నాడు పిల్లాడు. జాతరలో కనబడుతున్న బొమ్మలను ఆత్రంగా చూసి చూసి, నచ్చిన బొమ్మ కొనివ్వని నాన్న మీద మెల్లగా కోపం ప్రారంభమైంది పిల్లాడికి. తను ఇష్టపడిన బొమ్మలు కొనివ్వడం లేదు నాన్న, మరి నన్ను జాతరకు ఎందుకు తీసుకొచ్చినట్లు? అనే చిరాకు మొదలైంది పిల్లాడిలో. ఉన్న కొద్దిపాటి డబ్బు మొత్తం పిల్లాడి బొమ్మలకు ఖర్చు పెడితే ఇంట్లో వస్తువుల మాటేమిటి అని ఆందోళనతో...  ఉన్నంతలో ఏదైనా ఒక బొమ్మ కొని కొడుకును సంతోషపెట్టాలని ఆరాటంతో. ఆ పేద తండ్రి మనసులో ఆవేదన పడుతున్నాడు. ఇంతలో ఎవరో నాన్నను పలకరించారు. మాటల్లోపడి పిల్లాడి చేయి వదిలాడు నాన్న. జాతరలో జనం పెరిగారు. చుట్టూ కనబడుతున్న బొమ్మలను ఆత్రంగా చూస్తూ పిల్లాడు నాన్నను గమనించకుండా ముందుకెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత వెనక్కి తిరిగి చూస్తే నాన్న కనిపించలేదు. పిల్లాడికి భయం కలిగింది. కన్నీళ్లు వచ్చాయి ఏడుపు మొదలైంది. పిల్లాడి చుట్టూ అందరూ పోగయ్యారు. ఎవరు బాబు నువ్వు, ఎందుకు ఏడుస్తున్నావు ఊరుకో అని చుట్టూ చేరినవారు ఓదార్చినా పిల్లాడి ఏడుపు ఆగడం లేదు. బొమ్మలిస్తాం ఊరుకో అని చెప్పినా "నాకు బొమ్మలొద్దు నాన్న కావాలి" అంటూ ఏడుస్తూనే ఉన్నాడు. తినుబండారాలు ఇచ్చి ఏడవద్దు అన్నారు. అయినాసరే "నాన్న కావాలి" అన్నాడు. ఎవ్వరు ఏమి చెప్పినా ఏడుపు ఆపడం లేదు ఆ పిల్లాడు. అప్పటిదాకా బొమ్మలు కొనివ్వలేదని మనసులో నాన్నను తిట్టుకున్న ఆ పిల్లాడు ఇప్పుడు బొమ్మలగురించి ఆలోచించడం లేదు. నాన్న కావాలంటూ ఏడుస్తున్నాడు. జాతరలో అంతటా వెదికి వెదికి కొడుకును చివరకు చేరుకున్నాడు నాన్న. తనను వెదుక్కుంటూ చేరిన నాన్నను చూసి ఆనందంగా నాన్న అక్కున చేరిపోయాడు ఆ పిల్లాడు. కొడుకును చూసి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుండగా బొమ్మలు కొందాం పద అన్నాడు నాన్న. "వద్దు నాన్న! నువ్వెప్పుడూ నా చేయి విడవొద్దు. ఇంటికెళదాం పద" అంటూ నాన్నను పట్టుకుని హత్తుకుపోయాడు కొడుకు. నాన్న ఉంటే భరోసా... నాన్న ఉంటే ధైర్యం.క్రొవ్వొత్తిలా కరుగుతూ వెలుగునిచ్ఛే వాడు నాన్న! రాళ్ళ దెబ్బలు తిని పళ్ళు ఇచ్చే చెట్టులాంటి వాడు నాన్న!వేలు పట్టి నడిపించేవాడు! వేలు పెట్టి చదివించేవాడుమన విజయం కొరకు తపించేవాడునాన్న చేసిన త్యాగాలు... నాన్న గొప్పతనం.నాన్న బాధ్యత. ఎన్ని చెప్పుకున్నా తక్కువే. నాన్నా! మళ్ళీ బాల్యంలోకి వెనక్కి వెళ్ళే అవకాశం వస్తే నీ మనసు నొప్పించకుండా నీ చేయి పట్టుకుని మళ్ళీ నడవాలనుంది నాన్నా ఆనంద భాష్పాలు వెలుబుచ్చారు