అభిరుచికి తగిన రంగాలను ఎంచుకొని రాణించాలి

Published: Monday September 20, 2021
రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఉషిరెడ్డి
వికారాబాద్ బ్యూరో 19 సెప్టెంబర్ ప్రజాపాలన : నేటి యువత తమ అభిరుచికి తగిన రంగాలను ఎంచుకుని రాణించాలని రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఉషిరెడ్డి హితవు పలికారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని స్త్రీ శక్తి భవనంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు రాఘవన్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏదైనా రంగాన్ని ఎంచుకునేటప్పుడు కమిట్మెంట్ ఉండాలని సూచించారు. శారీరకంగా మానసికంగా తత్వం కలిగి ఉన్నప్పుడే క్రీడలలో రాణిస్తారని పేర్కొన్నారు. కబడ్డీ ఆటలో ప్రాథమిక అంశాలపై దృష్టి పెట్టి సాధన చేస్తే విజయం చేకూరుతుందని స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో కబడ్డీ అసోసియేషన్ తరపున స్పోర్ట్స్ క్లబ్ ఏర్పాటు చేసేందుకు నా శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వికారాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు రాఘవన్ నాయక్ మాట్లాడుతూ కబడ్డీ ఆటకు నయా పైసా ఖర్చు ఉండదని తెలిపారు. ప్రతి గ్రామంలో లో మార్పు లేని ఆట ఏదైనా ఉన్నదంటే అది కేవలం కబడ్డీ ఆట మాత్రమే అని గుర్తు చేశారు. కబడ్డీ కోర్టును గీయడానికి పరికరాలు అవసరం లేకున్నా చేతి వేళ్లతో గీయవచ్చని వివరించారు. కబడ్డీ ఆటలో మెలకువలను ఒడిసి పట్టుకోవాలని సూచించారు. ఒక ఆటగానికి సమర్థత ఆలోచన వివేకము సమయస్ఫూర్తి దీర్ఘకాల శ్వాస అత్యవసరమని పేర్కొన్నారు. రాబోవు రోజుల్లో వికారాబాద్ ప్రాంతం నుండి జాతీయ కబడ్డీ పోటీలలో కనీసం 5 మంది ఆటగాళ్లు ఉండేటట్లు తయారు చేస్తామన్నారు. ఇంతవరకు తెలంగాణ రాష్ట్రం నుండి కబడ్డీ పోటీలలో ఒకే ఒక్క ఆటగాడు ఉండేవాడని చెప్పారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు సంతోష్ గౌడ్, కోశాధికారి బాబన్న వికారాబాద్ చైర్మన్ వెంకటరమణ కార్యదర్శి సాయి రెడ్డి ప్రిన్సిపాల్ గంగా రామ్ నాయక్ ఆర్గనైజర్ సుభాష్ ధారూర్ వైస్ ఎంపీపీ విజయ్ నాయక్ సేవాలాల్ అధికార ప్రతినిధి రవి నాయక్ రాఘవేంద్ర గౌడ్ జిల్లా అధ్యక్షులు పరశురామ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.