తల్లాడలో భారీ వర్షం ప్రధాన రోడ్లపై నిలిచిన నీరు

Published: Saturday July 23, 2022

అవస్థలు పడుతున్న వాహనదారులు, స్థానికులు..

తల్లాడ, జులై 22 (ప్రజా పాలన న్యూస్):

తల్లాడ పట్టణంలో వరద పోటేత్తింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం రావడంతో తల్లాడ ప్రధాన రహదారి కాలవలను తలపిస్తున్నాయి. ప్రధానంగా బస్టాండ్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారి అయితే చెరువును తలపిస్తుంది. అదేవిధంగా తల్లాడ రింగ్ రోడ్డు సెంటర్లో పెద్ద పెద్ద గుంతలు ఉండటంతో వాహనదారులు అవస్థలు వర్ణనాతీతం, అంతేకాకుండా ప్రస్తుతం వర్షం రావడంతో ఆ గుంతల్లో భారీగా నీరు ఉండటంతో ద్విచక్ర వాహనదారులు అటుగా వెళుతుంటే గుంతల్లో పడి నానా అవస్థలు పడుతున్నారు. బస్టాండ్ ఎదురుగా అయితే భారీగా నీరు చేరి చెరువును తలపిస్తోంది. ఇటీవల వారం రోజులు పాటు వర్షాలు రావడంతో మండల అధికారులు తూతూ మంత్రంగా నామమాత్ర పనులు చేపట్టారు. ప్రస్తుతం మరలా వర్షాలు కురవడంతో అదే పరిస్థితి నెలకొంది. పట్టణ ప్రధాన రహదారి ఈ దుస్థితిలో ఉన్న దాన్ని పట్టించుకున్న నాధుడే కరువయ్యారు. అధికారులతో పాటు పాలకవర్గం కూడా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో వాహనదారులతో పాటు స్థానికులు కూడా అధికారులు, పాలకవర్గం తీరుపై మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రజల అవస్థలను గుర్తించి ప్రధాన రహదారికి మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.