కులరహిత సమాజం నిర్మాణమే లక్ష్యం

Published: Tuesday April 06, 2021

జిల్లా కలెక్టర్ పౌసుమి బసు

వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 05 ( ప్రజాపాలన ) : భారత మాజీ ఉప ప్రధాని, భారతరత్న డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 114 వ జయంతి సందర్భంగా సోమవారం వికారాబాద్ పట్టణంలోని ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ పౌసుమి బసు స్థానిక శాసన సభ్యులు మెతుకు ఆనంద్, చేవెళ్ల శాసన సభ్యులు కాలే యాదయ్యలు  తదితరులు కలసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ కులరహిత సమాజం కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహోన్నత వ్యక్తి అని పేర్కొన్నారు. తర తరాల అంతరాలను రూపుమాపేది విద్య ఒక్కటేనని, అందరూ కూడా  అణగారిన వర్గాల వారు విద్యాపరంగా ఎదిగేలా ప్రోత్సహించాలన్నారు. వారి అభ్యున్నతికి కృషి చేయాలన్నారు. బాబు జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో ఆయన ఆశయాలకు అనుగుణంగా  నడుచుకోవాలన్నారు. వికారాబాద్ శాసనసభ్యులు మెతుకు ఆనంద్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు చిరస్మరణీయమని, కుల అణచివేత, మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా, కుల రహిత సమాజం కోసం అణగారిన సామజిక వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేసారని అయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, ఏసీపీ రషీద్, ఆర్డీఓ ఉపేందర్ రెడ్డి, డిఎస్ సిడిఓ మల్లేశం, టీటీడీఓ కోటాజి, ఎస్సీ కార్పొరేషన్ ఈడి బాబు మోజెజ్, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్, ఎంపీపీ చంద్రకళ, పుర ప్రముఖులు, సంఘ నాయకులు రాజలింగం  తదితరులు పాల్గొన్నారు.