జాలిముడి ప్రాజెక్టును సందర్శించిన మద్దెల ప్రసాదరావు, చెన్నారెడ్డి

Published: Monday September 27, 2021
మధిర టౌన్ సెప్టెంబర్ 26 ప్రజాపాలన ప్రతినిధి మధిర నియోజకవర్గం లోని మధిర, బోనకల్లు మండలాలకు సాగునీరు, త్రాగునీరు అందించేందుకు మధిర మండలం జాలిముడి గ్రామం వద్ద వైరా నదిపై నిర్మించిన జాలిముడి ప్రాజెక్టు కాలువల పనులను తక్షణమే పూర్తిచేయాలని, వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మద్దెల ప్రసాదరావు శీలం చెన్నారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం వారు జాలిముడి ప్రాజెక్టును పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాట్లాడుతూ 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం జాలిముడి ప్రాజెక్టు నిర్మాణం కోసం 29.30 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని వారు తెలిపారు. ప్రాజెక్టు సకాలంలో పూర్తయినా ప్రాజెక్టుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన కుడి, ఎడమ కాల్వల నిర్మాణ పనులు పన్నెండు సంవత్సరాలు అవుతున్న పూర్తి కాకపోవడం శోషనీయం అన్నారు. అంతేకాకుండా జాలిముడి ప్రాజెక్టు  వ్యయాన్ని గత సంవత్సరం ఆగస్టు 26న రాష్ట్ర నీటి పారుదల ముఖ్య కార్యదర్శి  రజిత్ కుమార్ 76.74 కోట్ల రూపాయలకు పెంచినట్లు వారు  తెలిపారు. ప్రభుత్వ అలసత్వం వలన కాలువల నిర్మాణ పనుల్లో జాప్యం జరిగి నియోజకవర్గంలో ఉన్న రైతులకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. అదేవిధంగా మధిర మండలం మహాదేవపురం గ్రామంలో 2017 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం 12.30 కోట్ల రూపాయలతో ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేసిందన్నారు. దానికి ఆ నాటి మంత్రి తుమ్మల నాగేశ్వరావు శంకుస్థాపన చేశారని, దాదాపు నాలుగేళ్లు అవుతున్న మహాదేవపురం ఎత్తిపోతల పథకం  నేటికీ పూర్తి కాలేదని వారు ఆరోపించారు. మధిర మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వైరా నదిపై మధిర శివాలయం వద్ద లిఫ్ట్ కం బ్రిడ్జి నిర్మిస్తామని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. కానీ ఇప్పుడు మధిర శివాలయం వద్ద వైరా నదిపై కేవలం ఎత్తిపోతల పథకం మాత్రమే నిర్మిస్తున్నారని, దీనివల్ల రైతులకు గాని ప్రజలకు గాని ఉపయోగం లేదని తెలిపారు. ఈ ఎత్తిపోతల పథకం వల్ల ప్రజలకు ఎటువంటి ప్రయోజనం లేకపోగా, వరదలు వస్తే మధిర లోని లోతట్టు ప్రాంతం మునిగిపోతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆలోచన చేసి మధిర శివాలయం వద్ద నిర్మించే ఎత్తిపోతల పథకానికి ఇరువైపులా రక్షణ గోడలు కట్టాలని వారు సూచించారు. రైతు సంక్షేమం అని గొప్పలు చెప్పుకుంటున్న టిఆర్ఎస్ ప్రభుత్వం మధిర మండలం మహాదేవపురం ఎత్తిపోతల పథకాన్ని, జాలిముడి కాలవుల నిర్మాణం ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా పదేళ్లుగా జాలిముడి ప్రాజెక్టు కాలువల నిర్మాణ పనుల్లో ఎందుకు జాప్యం జరుగుతుందో అధికారులు బహిరంగ పరచాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ బోనకల్లు మండల అధ్యక్షులు మౌలానా వేమిరెడ్డి రామకృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.