*కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను కాపాడాలి* - ఐక్య విద్యార్థి సంఘాల డిమాండ్

Published: Friday December 30, 2022
మంచిర్యాల టౌన్, డిసెంబర్ 29, ప్రజాపాలన: కబ్జాకు గురైన విలువైన ప్రభుత్వ భూములను వెంటనే స్వాధీనం చేసుకొవాలని డిమాండ్ చేస్తూ ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు మంచిర్యాల జిల్లా కేంద్రంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ జిల్లాలో నిరుపేద ప్రజలకు ఇంటి స్థలం కోసం గజం కూడా భూమి లేదని చెప్పే రెవెన్యూ అధికారులు, ఒక వేళ ప్రభుత్వ భూమిలో ఇంటి నిర్మాణం చేసుకున్న పేద ప్రజల ఇండ్లను కూల్చే అధికారులు, క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్ శివారులో గల ప్రభుత్వ భూమి అధికారుల అండగా   ఎకరాలకు ఎకరాలు రియల్ఎస్టేట్ వ్యాపారులు కబ్జాలు చేసి, పెద్ద పెద్ద భవంతులు నిర్మిచుకొని, అద్దెలకు ఇస్తూ వ్యాపారాలు చేస్తున్న రెవెన్యూ యంత్రాంగం, పాలన యంత్రాంగం అటు వైపు కన్నెత్తి చూడకపోవడం సిగ్గు చేటు అని అన్నారు. ప్రభుత్వ భూమిలో మూడు అంతస్తుల భవనం నిర్మించి ప్రైవేటు పాఠశాలకు అద్దెకు కూడా ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. వెంటనే ఇట్టి భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని కోట్లాది రూపాయలు విలువ చేసే భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారులు నుంచి స్వాధీనం చేసుకొని, ఉండడానికి ఇల్లు లేనటువంటి పేద ప్రజలకు ఇళ్ల నిర్మాణం కోసం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని యెడల పలు ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. 
ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక రాష్ట్ర కార్యదర్శి చిప్పకుర్తి శ్రీనివాస్, నేతకాని స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జిమ్మిడి గోపాల్, తెలంగాణ బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి జాగిరి రాజేష్, తెలంగాణ విద్యార్థి సమాఖ్య జిల్లా అధ్యక్షుడు రేగుంట క్రాంతి కుమార్, విద్యార్థి జన సమితి జిల్లా అధ్యక్షుడు బచ్చలి ప్రవీణ్ కుమార్, నేషనలిస్ట్ స్టూడెంట్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పురేళ్ల నితీష్ మరియు తదితరులు పాల్గొన్నారు.