పేద రైతుల భూములను ఆక్రమించిన రియాల్టర్

Published: Wednesday December 28, 2022

శంకరపట్నం డిసెంబర్ 27 ప్రజాపాలన రిపోర్టర్:


శంకరపట్నం మండలం కాచాపూర్ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 227 లో గత 60 సంవత్సరాల నుండి పట్టా పాస్ పుస్తకం, పహాణి, రైతుబంధు సైతం అందుకుంటున్న ఊకంటి సదానందచారికి చెందిన నాలుగు ఎకరాల భూమిలో పరంధామయ్య అనే రియాల్టర్ పోలీసు,రెవెన్యూ అధికారుల అండదండలతో అక్రమంగా ప్రవేశించి బాధిత రైతులను బెదిరించి ఫెన్సింగ్, కనీలు పాతారని  సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి అన్నారు.
మంగళవారము సిపిఎం జిల్లా నాయకత్వం ఆధ్వర్యంలో బాధిత రైతులను పరామర్శించి, ఆక్రమణకు గురైన భూమిని సందర్శించి ఈ సందర్భంగా వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ..గతంలో ఈ భూమిపైన వివాదాలు ఉండగా ఊకంటి సదానంద చారి కోర్టులో కేసు వేశారని కేసు విచారణలో ఉండగా కేశపట్నం ఎఎస్సై తన పోలీస్ సిబ్బందితో రైతులను బెదిరించి, కోర్టు తీర్పు పరంధాములకు అనుకూలంగా వచ్చిందని అబద్ధాలు చెబుతూ భూమిచుట్టూ ఫెన్సింగ్ వేయించారని అన్నారు. అడ్డుకోబోతున్న రైతులను బెదిరించి,కేసులు పెట్టి లోపల వేస్తామని భయభ్రాంతులకు గురి చేశారని బాధిత రైతులు  సిపిఎం బృందానికి తెలిపారు.
గతంలో రెవెన్యూ అధికారులకు,డిఐ కి దరఖాస్తు చేసుకోగా రెవెన్యూ అధికారులు లంచాలకు అమ్ముడుపోయి మూడుసార్లు వచ్చి ఒక్కోసారి ఒక దిక్కున హద్దులు పాతారని అన్నారు.
ఐఏఎస్ అధికారి సర్టిఫైడ్ చేసిన కాపీలు ఉండగా,అవి చెల్లవని,రెవెన్యూ అధికారులు వారికి నచ్చినట్టు హద్దులు పాతారని బాదిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
కోర్టులో కేసు నడుస్తుండగా సివిల్ సమస్యల్లో పోలీసులు దగ్గరుండి ఫెన్సింగ్ వేయించడం వెనక ఆంతర్యం ఏoటని వాసుదేవ రెడ్డి ప్రశ్నించారు.
కలెక్టర్ ఇచ్చిన సర్టిఫైడ్ కాపీయే చెల్లకుంటే, ఏ నక్ష ప్రకారం హద్దులు వేశారని అయన అన్నారు.                  6 దశబ్దాలుగా కబ్జాలో ఉన్న రైతులను కాదని రెండు సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన పరంధాములకు రెవెన్యూ అధికారులు, పోలీసులు ఏ విధంగా వత్తాసు పలుకుతారని ప్రశ్నించారు.బాధిత రైతులకు భూమి దక్కేవరకు సిపిఎం ఆధ్వర్యంలో ఎంతవరకైనా పోరాడుతామని పై అధికారుల దృష్టికి,కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి బాధితుల పక్షాన నిలుస్తామని అన్నారు.భూవివాదాల్లో జోక్యం చేసుకున్న పోలీసు అధికారులపై సీపీ గారికి ఫిర్యాదు చేస్తామని, ఇప్పటికైనా ఊకంటి సదానంద చారి కి చెందవలసిన భూమిని వెంటనే అప్పగించాలని, లేదంటే పార్టీ ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సందర్శించిన వారిలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గీట్ల ముకుందరెడ్డి, గుడికందుల సత్యం,జిల్లా కమిటీ సభ్యులు యు. శ్రీనివాసు,ఎడ్ల రమేష్, జి.రాజేశం,శంకరపట్నం జోన్ కమిటీ సభ్యులు వడ్ల రాజు, యుగేందర్ తదితరులు పాల్గొన్నారు.