ప్రజావాణి సమస్యల పరిష్కారానికి చర్యలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

Published: Tuesday March 14, 2023
మంచిర్యాల బ్యూరో, మార్చ్ 13, ప్రజాపాలన : 
 
 
ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు చేసుకున్న దరఖాస్తులను సంబంధిత శాఖల సమన్వయంతో క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ భవన సముదాయంలో గల కలెక్టర్ ఛాంబర్లో జిల్లా అదనపు కలెక్టర్లు డి. మధుసూదన్ నాయక్, బి. రాహుల్, ట్రైనీ కలెక్టర్ పి. గౌతమితో కలసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. జన్నారం మండలం రోటిగూడ గ్రామానికి చెందిన చెరుకు శ్రీనివాస్ తన తండ్రి చెరుకు లచ్చన్న పేరిట గల భూమి నుండి కొంత భూమిని ఇతరులు ఆక్రమించుకున్నారని, ఈ విషయమై విచారించి న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. దండేపల్లి మండలం గూడెం గ్రామానికి తోట కమలాకర్ గూడెం గ్రామంలోని 1/70 చట్టం పరిధిలో గల భూమిని నిబంధనలకు విరుద్ధంగా వ్యక్తి పేరు పై చేసిన పట్టాను రద్దు చేస్తూ తమ భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అర్జీ సమర్పించారు. ఏ. ఐ. ఎస్. ఎఫ్. ప్రతినిధులు తమ దరఖాస్తులో జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్డులో గల గర్మెళ్ళ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. జన్నారం మండలం దేవునిగూడ గ్రామపంచాయతీ చర్లపల్లి గ్రామానికి చెందిన శ్రీరాముల శ్రీనివాస్ తాను దివ్యాంగుల పెన్షన్ ప్రభుత్వం నుండి పొందుతున్నానని, తన భార్య అనారోగ్య కారణాల వలన అత్యవసర చికిత్స కోసం హైదరాబాదు వెళ్లిన కారణంగా 3వ నెల పింఛన్ తీసుకోలేకపోయానని, ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. జైపూర్ మండలం ఇందారం గ్రామానికి చెందిన కామెర సందీప్ నందమూరి మండలం క్యాతన్ పల్లి శివారులోని సీలింగ్ భూమిని కొందరు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని, ఈ నిర్మాణాన్ని నిలుపదలు చేసి భూమిని కాపాడాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. నస్పూర్ మండలం తీగల్పాడు గ్రామానికి చెందిన విశ్రాంత ఉద్యోగి పూదరి చంద్రయ్య వృద్ధాప్యంలో తన పోషణ చూడవలసిన కొడుకు తన స్వార్జితమైన ఇంటి నుండి వెళ్లగొట్టారని, తన ఇంటితో పాటు పోషణ నిమిత్తం కొంత మొత్తాన్ని ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. మంచిర్యాల పట్టణం గర్మిళ్ల ప్రాంతానికి చెందిన ఎస్. ప్రశాంతి దివ్యాంగురాలిని అయిన తనకు ప్రభుత్వం అందిస్తున్న రెండు పడక గదుల ఇండ్ల పథకంలో అవకాశం కల్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. భీమిని మండలం అక్కలపల్లి గ్రామానికి చెందిన చింతపురి రాందాస్ తనకు తన తాతల నుండి వారసత్వంగా వచ్చిన భూమిని ఇలాంటి లావాదేవీలు జరగకుండా ధరణిలో నిషేధించారని, తన భూమిని నిషేధిత జాబితా నుండి తొలగించి లావాదేవీలకు అనుమతించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. మంచిర్యాల పట్టణం సూర్య నగర్ కు చెందిన క్యాతం లక్ష్మి తన భర్త పేరిట చాలా భూమిని తన పేరున విరాసత్ చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో అందిన ప్రతి దరఖాస్తులను ఆయా సంబంధిత శాఖ అధికారుల సమన్వయంతో పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.