పొగాకు, మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి

Published: Tuesday June 01, 2021
: సైబరాబాద్ సీపీ సజ్జనార్
 
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంను పురస్కరించుకుని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో కొత్తపల్లి కోటేశ్వరరావు సౌజన్యంతో ముద్రించిన గోడ పత్రిక (స్టిక్కర్) ను సోమవారం నాడు సైబరాబాద్ కమిషనరేట్లో సైబరాబాద్ పోలీస్ కమీషనర్, ఏడిజిపి  విసి సజ్జనార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొగాకు, పొగాకు ఉత్పత్తులు (చుట్ట, బీడీ, సిగరెట్, గుట్కా మొదలగునవి) వినియోగించడం వలన శ్వాసకోశ వ్యాధులు, గుండె సంభధిత వ్యాధులు, ఓరల్ క్యాన్సర్, లంగ్ కాన్సర్ లాంటి వ్యాధులకు గురై ప్రపంచవ్యాప్తంగా 10 మిలియన్లు మంది ప్రజలు మృత్యువాత పడుతున్నారు. పొగాకు, పొగాకు ఉత్పత్తులు వినియోగించడం వలన జరిగే అనర్ధాలు ఆస్థినష్టం, ప్రాణనష్టం నివారించటానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు ప్రజల్లో అవగాహన పెంచటానికి ప్రపంచవ్యాప్తంగా 1987 నుంచి ఈ దినోత్సవంను నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఒక థీమ్ తోటి నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం 2021 థీమ్ "పొగాకు, పొగాకు ఉత్పత్తుల వినియోగం నుండి నిష్క్రమించటానికి కట్టుబడి ఉండండి" అనే నినాదంతో ఈ కార్యక్రమం డబ్ల్యూహెచ్ఓ వారు నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగానే ఈ కార్యక్రమం అని అన్నారు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన చైనా, ఇండియా లోనే పొగాకు, పొగాకు ఉత్పత్తుల వినియోగదారులు అధికంగా ఉన్నారు అని అన్నారు. వీటి వినియోగం వలన మానవుడు జీవిత కాలం కూడా తగ్గి పోతున్నది. వ్యాధి నిరోధక శక్తి తగ్గి కరోనా వంటి వ్యాధులు కూడా రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నవి అన్నారు. కాన్సర్ వ్యాధిగ్రస్తులలో 30 శాతం మంది పొగాకు, పొగాకు ఉత్పత్తుల వినియోగం వలనే అని సర్వేలు చెబుతున్నాయి అని అన్నారు. ఇటీవల కాలంలో సమాజంలో వస్తున్న మార్పుల (పబ్ కల్చర్, రేవ్ పార్టీలు) కారణంగా యువతి, యువకులు అల్కాహాల్, పొగాకు, పొగాకు ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ సిగరెట్లు, మాదాకద్రవ్యాలు (హెరాయిన్, గంజాయి) వినియోగం అధికమవటం వలన ఆర్ధికంగా నష్టపోవటమే కాకుండా మృత్యువాత పడుతున్నారు అన్నారు. వీటి నివారణకై ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, పౌరసమాజం వీటి వినియోగంనుంచి ప్రజలను ముఖ్యంగా యువతను చేతన్య పరచాలని కోరారు. ఆరోగ్యమే మహాభాగ్యం కావున అందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తాడిబోయిన రామస్వామి యాదవ్, కొత్తపల్లి కోటేశ్వరరావు, రామ్మోహనరావు, పాలం శ్రీను, జనార్ధన్, విష్ణుప్రసాద్ మరియు ప్రముఖ దిన పత్రిక పాత్రికేయులు ఎల్లేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.