కాంగ్రెస్ పోరాటంతోనే దేశానికి స్వాతంత్రం వచ్చిందిసీఎల్పీ లీడర్ మల్లు భట్టివిక్రమార్క

Published: Thursday December 29, 2022
మధిర రూరల్ డిసెంబర్ 28 (ప్రజాపాలన ప్రతినిధి) కాంగ్రెస్ పార్టీతోనే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం ఖమ్మం జిల్లా మధిర కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ జెండాను ఎగరవేసి కేక్ కట్ చేశారు. అనంతరం భట్టి విక్రమార్క విలేకరులతో మాట్లాడుతూ ఈ దేశ స్వాతంత్ర తో పాటు సమాజంలో ఉన్న అనేక రుగ్మతలను తొలిగించటానికి  కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసి సాధించింది.
ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేయడానికి డాక్టర్.బి. ఆర్.అంబేద్కర్ ఆధ్వర్యంలో రాత పూర్వకంగా రాజ్యంగాన్ని కాంగ్రెస్ పార్టీ రూపొందించింది.
కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన భారత రాజ్యాంగం వల్ల దేశంలో ప్రశాంతంగా ఎన్నికలు జరగడంతో పాటు   ఎలాంటి హింస ఇబ్బంది లేకుండా సహజసిద్ధంగా అధికార మార్పిడి జరుగుతున్నదన్నారు. భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉండటమే ఇందుకు కారణం అన్నారు.
భారతదేశంతో  పాటు స్వాతంత్రం వచ్చిన పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం పటిష్టంగా లేకపోవడంతో ఎన్నికలలో గెలిచిన ప్రభుత్వాలను అక్కడ ఆర్మీ కూలదోస్తున్నదన్నారు. అనేకమార్లు ఆ దేశ అధ్యక్షులను అరెస్టులు చేసి నిర్బంధించడం ఉరి తీయడం, కాల్చి చంపడం లాంటి దుర్ఘటనలకు అక్కడి ప్రజాస్వామ్యం రాజ్యాంగం పటిష్టంగా లేకపోవడమే కారణమన్నారు.
సమాజంలో చర్చలు, శాంతియుత భావం ద్వారానే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెప్పి, అలాంటి మార్గాలను చూపెట్టి ప్రపంచానికి ఆదర్శంగా కాంగ్రెస్ పార్టీ నిలిచిందన్నారు భారతదేశంలో  నిర్వహించిన అనేక ఉద్యమాల్లో ఏ రోజు కూడా హింసను  ప్రోత్సహించని ఏకైక పార్టీ కాంగ్రెస్ అన్నారు.
గణతంత్ర, స్వాతంత్ర, లౌకికవాద, సామ్యవాద, సర్వసత్తాక భారతదేశాన్ని  రాజ్యాంగం ద్వారా ఏర్పాటు చేసుకుని ఫెడరల్ స్ఫూర్తిని కాంగ్రెస్ కొనసాగించిందన్నారు. ప్రపంచంలో యుద్ధాలు చేసుకుంటున్న దేశాలు మహాత్మా గాంధీ చూపిన అహింస మార్గం, గాంధేయవాదం, శాంతి వైపు చూస్తున్నాయని భట్టి విక్రమార్క గుర్తు చేశారు. మహాత్మాగాంధీ అనుసరించిన శాంతి, అహింస సిద్ధాంతంతోనే నేడు దేశాల మధ్య జరిగే యుద్దాలు శాంతియుతంగా పరిష్కారం అవుతున్నాయన్నారు. పేదలు అభివృద్ధి చెందటమే కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతమని, దేశానికి స్వాతంత్రం తీసుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ దేశ అభివృద్ధి కోసం పంచవర్ష ప్రణాళికలు, మిశ్రమ ఆర్థిక విధానాలు, ప్లానింగ్ కమిషన్ తీసుకువచ్చి అభివృద్ధికి బాటలు వేసిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సురాం శెట్టి కిషోర్,మిరియాల రమణ గుప్తా, రంగా హనుమంతరావు కోనా ధని కుమార్, తూమాటి నవీన్ రెడ్డి, దారా బాలరాజు, షేక్ జహంగీర్ అద్దంకి రవి తదితరులు పాల్గొన్నారు.