నూతన దుద్యాల మండలంలో తహసిల్దార్ కార్యాలయం ప్రారంభం

Published: Tuesday October 04, 2022
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి
వికారాబాద్ బ్యూరో 3 అక్టోబర్ ప్రజాపాలన :  పాలనా సౌలభ్యం కోసం ప్రజలకు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లాలో నూతనంగా ఏర్పడ్డ దుద్యాల మండలంలో  తహసిల్దార్ కార్యాలయం మండల విద్యాశాఖ  కార్యాలయాలను 
మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు మన్యం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి,  కొడంగల్ శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డిలతో కలిసి మంత్రి ప్రారంభోత్సవం గావించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తూనే ప్రజలకు అందుబాటులో ఉంటుందని వివరించారు. కింది స్థాయిలో ఉన్న ప్రజలకు పాలనను చేరువ చేయడానికి కృషి చేస్తున్నామని మంత్రి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు పది జిల్లాలు ఉన్న వాటిని 33 జిల్లాలుగా ఏర్పాటు చేసుకొన్నామని గుర్తు చేశారు. అధికారులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందని మంత్రి అన్నారు. రైతన్నకు భరోసాగా వ్యవసాయ రంగానికి ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ అందించిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానిదే అని మంత్రి పేర్కొన్నారు. రైతుల పెట్టుబడి నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఆర్థిక  సహాయం చేస్తూ రైతులను ఆదుకోవడం జరుగుతుందని చెప్పారు.  రైతులు అకాల మరణం చెందినట్లయితే వారి కుటుంబానికి ఆసరాగా రైతు బీమా పథకాన్ని తీసుకొచ్చి వారిని ఆదుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ అవతరించక ముందు నీటిని ఒడిసి పట్టకపోవడంతో బోర్లు ఎండిపోవడంతో రైతులు ఎంతో ఇబ్బంది పడే వారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పూర్తిచేస్తూ అవసరం ఉన్న ప్రాంతాల్లో నిర్మాణాలను ప్రోత్సహిస్తుందని తెలిపారు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్న సమాజాన్ని చూడాలన్న దృడ సంకల్పముతో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశ పెట్టారన్నారు. దళితులు ఆర్థికంగా ఎదిగేందుకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలను  ఇచ్చి వారి జీవితాలు మెరుగుపడేలా చర్యలు తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. మా పాలన మాకు దక్కాలని కోరుకున్న గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. గిరిజన జనాభా ప్రాతిపదిక  రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు  10% శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జీవోను విడుదల చేయడం అభినందనీయమని కొనియాడారు.
మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యులు మన్నె శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత మరుగున పడిపోయిన తెలంగాణ సంస్కృతిని వెలుగులోకి తీసుకురావడం జరిగిందని అన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రంలో ఎన్నో మార్పులు తీసుకువస్తూ ప్రజలకు సేవలు అందించడం జరుగుతుందని ఆయన అన్నారు. పాలనాపరంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ బంగారు తెలంగాణ ఏర్పాటుకు పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో తండాలుగా ఉన్న వాటిని గ్రామపంచాయతీలుగా మార్చి ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని అన్నారు. రైతు బంధు,  రైతు బీమా పథకాలు  రైతన్నలకు కొండంత భరోసా కల్పిస్తున్నవని వివరించారు. ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ..  ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం అనూహ్యంగా ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువచ్చిందని అన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో ప్రజల అభీష్టం మేరకు నూతనంగా మూడు మండలాలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలను అందించాలని ఆయన అన్నారు.
అంతకుముందు బొమ్మరాసిపేట మండలం తుంకిమెట్ల లో  3 కోట్ల 14 లక్షల రూపాయలవ్యయంతో నిర్మించిన చెక్ డ్యామ్ ప్రారంభోత్సవం,  22 లక్షల వ్యయంతో నిర్మాణం చేపట్టే కూరగాయల మార్కెట్ కు మంత్రి శంకుస్థాపన గావించారు.
 ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ నిఖిల,  జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, బొమ్మరాసిపేట్  జెడ్పిటిసి అరుణాదేశు,  ఎంపీపీ హేమీబాయి, పి ఏ సి ఎస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, సర్పంచ్ స్వరూప, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, ఎంపీపీ మండల ఉపాధ్యక్షులు సుదర్శన్ రెడ్డి , కోఆప్షన్ సభ్యులు మహిమూద్ , ఎంపీటీసీ తిరుపతయ్య ముదిరాజ్ లతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.