రైతు హామీలను అమలు పరచని కేంద్ర ప్రభుత్వం, మోడీ దిష్టిబొమ్మ దగ్ధం.....

Published: Tuesday February 01, 2022
ఎర్రుపాలెం జనవరి 31 ప్రజాపాలన ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకొని వచ్చిన మూడు నల్ల చట్టాలను రద్దు పరుస్తామని హామీ ఇచ్చి ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు పరచక పోవడం ప్రభుత్వ రైతు వ్యతిరేక వైఖరికి నిదర్శనమని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి జిల్లా కమిటీ సభ్యులు దివ్వెల వీరయ్య ప్రభుత్వాన్ని విమర్శించారు. సంయుక్త కిసాన్ మోర్చా దేశ వ్యాప్తంగా విద్రోహ దినంగా పాటించాలని ఇచ్చిన పిలుపుమేరకు సోమవారం మండల కేంద్రమైన ఎర్రుపాలెం రింగ్ సెంటర్ నందు రైతు సంఘం, ప్రజా సంఘాలు, సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ సాగు నల్ల చట్టాలను రద్దు పరచాలని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంవత్సర కాలం పాటు ధర్నా చేశారని రద్దు చేస్తానని హామీ ఇచ్చి రద్దు పరచడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని వాటిని వెంటనే రద్దు పర్చాలని డిమాండ్ చేశారు. ఆందోళన సందర్భంగా పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని అమరవీరుల కుటుంబాలకు నష్ట పరిహారం అందించాలని రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని తదితర రైతు సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రానున్న కాలంలో రైతు వ్యతిరేక పాలనకు గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సగుర్తి సంజీవరావు, నాగులవంచ వెంకట్రామయ్య, దేవరకొండ రామకృష్ణ, సుబ్బారెడ్డి, షేక్ బాబు, ఆవుల వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.