నర్సరీలో నాణ్యమైన మొక్కలను పెంచాలి

Published: Friday December 02, 2022
జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ
వికారాబాద్ బ్యూరోస్  01 డిసెంబర్ ప్రజా పాలన : నర్సరీల నిర్వహణ పకడ్బందీగా  నిర్వహించి, హరితహారంకు అవసరమైన నాణ్యమైన మొక్కలు అందించేందుకు సంబంధిత అధికారులు అందరు కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో హరితహారం నర్సరీల నిర్వహణ, పల్లె ప్రకృతి వనాలు, తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాల పనుల పురోగతిపై మండలాల వారీగా డిఆర్ డిఓ కృష్ణన్ తో కలిసి   సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈసారి హరితహారంకు అవసరమైన మొక్కలను అందించేందుకు ప్రతి గ్రామపంచాయతీలో నర్సరీల నిర్వహణ పటిష్టంగా చేపట్టాలని అన్నారు.    అవసరమైన నాణ్యమైన విత్తనాలను స్థానికంగా సేకరించి విత్తాలన్నారు.  విత్తిన విత్తనాలతో వంద శాంతం మొక్కలు మోలకెత్తేలా చూడాలన్నారు. మంచి రకం ప్లాస్టిక్ బ్యాగ్ లను వినియోగించి అందులో ఎర్ర, నల్ల మట్టి మిక్స్ చేసి ఈనెల 5 వరకు బ్యాగ్ ఫిల్లింగ్ పనులను పూర్తి చేసి 15 వరకు విత్తనాలను విత్తాలన్నారు.  గ్రామ పంచాయతీలలో నర్సరీల వారిగా ఎస్టిమేషన్ జెనరేషన్ పనులను వెంటనే పూర్తి చేయాలని అన్నారు.  నర్సరీలలో వన సేవకులుగా మహిళలను నియమించాలని తెలిపారు.  ఈసారి నర్సరీలలో మునగ, కరివేపాకు మొక్కలు పెంచేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని,  ఇట్టి మొక్కలను పాఠశాలల్లో ఎక్కువ నాటాలని సూచించారు.  ప్రతి నర్సరీలో కనీసం 500 మునగ మొక్కలు పెంచాలన్నారు.  నర్సరీలన్నింటిని ప్రభుత్వ  భూములలో ఏర్పాటు చేయాలని సూచించారు. తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాలు, పల్లె ప్రకృతి వనాలకు అవసరమైన స్థల సేకరణ పనులను పూర్తి చేసేందుకు అధికారులు దృష్టి సారించాలని అన్నారు. స్థల సేకరణకు ఎంపీడీఓ లు,  తహసీల్దార్ ల సహకారంతో ఈనెల 20 వరకు అన్ని గ్రామ పంచాయతీలలో క్రీడా ప్రాంగణాలు, పల్లె ప్రకృతి వనాల కొసం స్థల సేకరణ పనులను పూర్తి చేయాలని సూచించారు. క్రీడా ప్రాంగణాలు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నందున పనులను  వేగవంతంగా చేపట్టి పూర్తి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ లు, ఎంపీవో లు, ఏపిఓ లు, ఇసి లు, తదితరులు పాల్గొన్నారు.