ఖాళీగా ఉన్న డాక్టర్ల పోస్టులను వెంటనే నియమించాలని సిపిఐ ధర్నా

Published: Thursday June 10, 2021
మధిర, జూన్ 09, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ తొమ్మిదో తేదీనియోజకవర్గ కేంద్రమైన మధిర లోని ప్రభుత్వ ప్రభుత్వాస్పత్రిలో ఖాళీగా ఉన్న డాక్టర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ, మండల కార్యదర్శులు బెజవాడ రవిబాబు ఓట్ల కొండలరావు మాట్లాడుతూ డి ఎం హెచ్ ఓ మధిర ప్రభుత్వ ఆస్పత్రి, ప్రజల పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తూ మొండివైఖరిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గత కొన్ని ఏళ్లుగా మధిర ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్లు సిబ్బంది కొరతతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆసుపత్రిలోని సమస్యలపై  సంబంధిత జిల్లా కలెక్టర్, మంత్రి ఇతర అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు. అయినా సంబంధిత జిల్లా వైద్య అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో వైద్యాధికారి గా విధులు నిర్వహించిన డాక్టర్ శ్రావణ్ కుమార్ డిప్యుటేషన్ పై వెళ్లగా ఆయన స్థానంలో గతంలో మాటూరు పేట పీహెచ్సీ నందు పని చేసిన వైద్యులు డాక్టర్ శ్రీనివాస్ను నియమించాలని స్వయంగా జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు డి ఎం హెచ్ వో దృష్టికి తీసుకెళ్లినా డి ఎం హెచ్ ఓ ఇంత వరకు ఆదిశగా చర్యలు తీసుకోకపోవడం ఆమె అహంకారానికి నిదర్శనమని వారు ఆరోపించారు. ఇక్కడి అధికారుల నిర్లక్ష్యం, సిబ్బంది కొరత ఇతర కారణాల వలన  మధిర ప్రాంతంలో కరోనా పాజిటివ్ కేసులు పెరగడంతో మధిరను ప్రభుత్వం రెడ్ జోన్ గా ప్రకటించిందని, ఇది ఇక్కడ అధికారుల, ప్రజాప్రతినిధుల వైఫల్యానికి నిదర్శనం అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మధిర ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, సిబ్బంది కొరత ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు చావా మురళీకృష్ణ, సత్యనారాయణ, శ్రీను, నాగ కృష్ణ రమేష్, మడిపల్లి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.