సమాజ స్థితిని, గతిని మార్చేది స్త్రీ - స్త్రీవైద్య నిపుణులు

Published: Thursday March 09, 2023
రాయికల్, మార్చి08 (ప్రజాపాలన ప్రతినిధి): మానవ జీవనంలో స్త్రీ యొక్క పాత్ర చాలా ప్రత్యేకమైనదని అమ్మగా, ఆక్కగా,చెల్లిగా, స్నేహితురాలిగా,వ్యవస్థ నిర్వాహకురాలిగా,  ఇలా అనేక రకాల పాత్రలు పోషించే గొప్ప అవకాశం కేవలం మహిళకు మాత్రమే ఉందని, కావున మహిళలు తన శారీరక,మానసిక స్థితిని ఎల్లప్పుడూ కాపాడుకోవాలని  ప్రభుత్వ వైద్యశాలకు చెందిన ప్రముఖ స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ హరిత, డాక్టర్ వాణి లు పేర్కొన్నారు. పట్టణంలోని విస్డం హైస్కూల్లో ఘనంగా నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి వారు మాట్లాడారు. విద్యార్థులు బాగా చదివితేనే అన్ని రంగాల్లో ముందుంటారని అన్నారు. అనంతరం విద్యార్థులకు ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే పాటించవలసిన నియమాల గురించి తెలిపారు. అనంతరం
యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ తిరుపాల్ నాయక్ మహిళా దినోత్సవము సందర్భంగా విస్డం స్కూల్లోని మహిళా ఉపాధ్యాయులందరికీ మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్త్రీని ప్రోత్సహించాలని, వారికి ప్రోత్సాహకాన్ని అందిస్తే  వారు ఒక మహా వృక్షం లాగా మారి ఇతరులకు నీడనివ్వడమే కాకుండా మార్గదర్శి అవుతారని అన్నారు. పాఠశాల కరస్పాండెంట్ ముత్యంపు రాజురెడ్డి మాట్లాడుతూ "యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్రదేవతాః"ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని, అలాంటి స్త్రీని ఏడాదిలో ఒకరోజు మాత్రమే కాకుండా ప్రతినిత్యం మనం గౌరవించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ నివేదిత రెడ్డి, ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు.