తాండూర్ ప్రథమ పౌరురాలుపై చర్యలు తీసుకోవాలి

Published: Tuesday March 23, 2021
కాంగ్రెస్ ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థి చిన్నారెడ్డి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి మార్చి 22 ( ప్రజాపాలన ) : ఈ నెల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓటు వేసిన తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం ముందు భాగంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తాండూరు కాంగ్రెస్ ఇంచార్జ్ రమేష్ మహారాజ్ తాండూరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్ కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వరాల శ్రీనివాస్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు రత్నారెడ్డి యువజన కాంగ్రెస్ నాయకులు జొన్నల రవిశంకర్  చాపల శ్రీనివాస్ ముదిరాజ్ లతో కలిసి ధర్నా నిర్వహించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓటు వేసిన తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న తాటికొండ పరిమల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల ( 14 మార్చి 2021 ఆదివారం) 14న ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో తాండూరు పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని 281 పోలింగ్ కేంద్రంలో తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ దొంగ ఓటు వేశారని పేర్కొన్నారు. తన తోటి కోడలు పేరిట ఉన్న ఓటును చైర్ పర్సన్ వినియోగించుకోవడం సహేతుకం కాదని వివరించారు. తాండూర్ ప్రథమ పౌరురాలుగా ఎన్నుకోబడిన మున్సిపల్ చైర్ పర్సన్ దొంగ ఓటు వేయడం టిఆర్ఎస్ ప్రభుత్వ అరాచక పాలనకు నిదర్శనమని ఎత్తి చూపారు. తనకు పట్టభద్రుల ఎన్నికల జాబితాలో ఓటు హక్కు లేకున్నా తన తోటి కోడలు ఓటును చైర్ పర్సన్ స్వప్న వినియోగించుకోవడం తన పదవికే కళంకమని విమర్శించారు. 283 పోలింగ్ బూతులో 528 వరుస సంఖ్య కు సంబంధించి ఓటర్ జాబితాలో స్వప్న భర్త అశ్విన్ తాటికొండ అనే పేరుతో నమోదు చేయబడింది అని పేర్కొన్నారు. తన తోటి కోడలు పేరు కూడా స్వప్న కావడంతో ఆమె ఓటును చైర్ పర్సన్  వినియోగించుకున్నందున ఆమెపై 171డి, 171ఎఫ్, ఐపిసి సెక్షన్ 5 కింద, క్రిమినల్, చీటింగ్ కేసు బుక్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తాను దొంగ ఓటు వేసినా కూడా ఎమ్మెల్సీ మహేందర్రె డ్డితో కలిసి తాను కూడా ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఫోటోలు దిగడం అమానుషమని వివరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా జరగాల్సిన ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం కుట్రపూరితంగా రాజకీయ దురహంకారంతో ఎన్నికలు నిర్వహించారడానికి నిదర్శనం అని కొనియాడారు.