పశువుల్లో కంటే జీవాల్లో పరాన్న జీవుల సమస్య ఎక్కువ

Published: Saturday June 11, 2022
జిల్లా పశుసంవర్ధక శాఖ మరియు పశువైద్యాధికారి డాక్టర్ అనిల్ కుమార్
వికారాబాద్ బ్యూరో జూన్ 10 ప్రజాపాలన : 
పశువుల్లో కంటే జీవాల్లో పరాన్న జీవుల సమస్య ఎక్కువగా ఉంటుందని జిల్లా పశుసంవర్ధక శాఖ మరియు పశు వైద్యాధికారి డాక్టర్ అనిల్ కుమార్ అన్నారు.
శుక్రవారం మర్పల్లి మండలములోని తిమ్మాపూర్  గ్రామంలో మీతో నేను కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ 150 మేకలకు నట్టల మందు త్రాగించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్  మెతుకు ఆనంద్ తో పాటు జడ్పిటిసి మధుకర్, వైస్ ఎంపీపీ మోహన్ రెడ్డి, తిమ్మాపూర్ సర్పంచ్ శేఖర్,  స్థానిక ఎంపీటీసీ, తెరాస పార్టి నాయకులు రమేష్, తెరాస మండల ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి, మండల సర్పంచులు మరియు ఎంపీటీసీలు, జిల్లా పశుసంవర్ధక శాఖ మరియు పశువైద్యాధికారి డాక్టర్ అనిల్ కుమార్ గారు మరియు  సిరిపురం  పశువైద్యులు డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి, సిబ్బంది, కుమార్ లు  ఉన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లా పశుసంవర్ధక శాఖ మరియు పశు వైద్యాధికారి డాక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ గొర్రెలు మరియు మేకలలో నట్టల నివారణ ప్రాముఖ్యతను వివరించారు. గొర్రెలు, మేకల్లో ఏలికపాములు, బద్దెపురుగులు, లివర్‌ఫ్లూక్‌ మొదలగు అంతర్‌పరాన్నజీవుల వల్ల
అనేక అనర్థాలు సంభవిస్తాయని పేర్కొన్నారు. గొర్రెల, మేకల పెంపకందార్లు సుమారు 30% ఆదాయం
కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పశువుల్లో కంటే జీవాల్లో పరాన్న జీవుల సమస్య ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇక జీవాల
విషయానికొస్తే, వాటి ఆహారపు అలవాట్లు దృష్ట్యా, మేకల్లో కంటే గొర్రైల్లో పరాన్న జీవుల సమస్య ఎక్కువగా ఉంటుందని చెప్పారు. మేత లభ్యంకానప్పుడు, పోషకలోపం ఏర్పడినప్పుడు, వర్షాకాలంలో, అనావృష్టి సందర్భాల్లో,
అంటువ్యాధులు ప్రబలిన సమయాల్లో ఈ పరాన్నజీవుల బెడద ఎక్కువగా ఉంటుందని తెలిపారు. పరాన్న జీవులు కలుషితమైన నీరు త్రాగడం, మేత సంగ్రహించడం ద్వారా ఆశిస్తాయని గుర్తు చేశారు. అంతర్‌పరాన్న జీవులు శరీరం, కాలేయం, ఊపిరితిత్తులు, ప్రేవులు, జీర్ణాశయం మొదలగు అంతర్గత అవయవాల్లో స్థావరం ఏర్పరచుకుంటాయని సూచించారు. ఇవి జీవాల పోషక పదార్థాల్ని రక్తాన్ని స్వీకరించి, రక్తక్షీణతకు గురిచేస్తాయని హెచ్చరించారు. తద్వారా గొర్రెలు బరువు పెరగవని అన్నారు. ఎంతమేపినా చిక్కిపోతుంటాయని వెల్లడించారు. ఆకలిలేమి, పొట్టలావు, దవడ క్రింద నీరు చేరడం, విరోచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయని సూచనలు చేశారు. ప్రతిరోజు 4-5 చొప్పున జీవాలు మరణిస్తూనే ఉంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. కావున నట్టలు నివారించుటకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత నట్టల నివారణ మందు గొర్రెలు మరియు మేకలకు త్రాగించి లబ్ది పొంద వలసినదిగా  రైతులను కోరారు.