వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి

Published: Saturday June 11, 2022
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ బ్యూరో జూన్ 10 ప్రజాపాలన : 
రైతుల నుండి వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వారం రోజులలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిఖిల ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యక్రమంలోని కాన్ఫరెన్స్ హాలులో వరి ధాన్యం కొనుగోలుపై  ఐకేపి, డిసిఓ, డిసిఎంయస్, డిఎంఓ, డిసియస్ఓ, డిఎం సివిల్ సప్లై, ట్రాన్స్ పోర్టర్లు, మిల్లర్ అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఇప్పటివరకు 102 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 50.950 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుండి సేకరించడం జరిగిందన్నారు.  ఇందులో 46 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లర్ లకు పంపించడం జరిగిందని తెలిపారు.  జిల్లాలో ఇంకా 16 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వచ్చే అవకాశం ఉన్నదని అంచనా చేస్తున్నట్లు కలెక్టర్ తెలియజేసారు. 16 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని  రైతుల నుండి  వారం రోజులలో సేకరించి వర్షంలో తడవకుండా వెంటనే లారిలను ఏర్పాటు చేసి రైస్ మిల్లులకు సురక్షితంగా తరలించాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా, రైస్ మిల్లర్లు కూడా  జాప్యం చేయకుండా వెంటనే వచ్చిన ధాన్యాన్ని  తీసుకోవాలన్నారు.  రైస్ మిల్లర్లు, ట్రాన్స్ పోర్టర్ లకు సంబంధించి బకాయి చెల్లింపులను వెంటనే చెల్లించాలని సివిల్ సప్లై జిల్లా మేనేజర్ను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి విజయకుమారి, డి ఆర్ డి ఓ కృష్ణన్, జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేశ్వర్, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ విమల తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area