పేద ప్రజలకు మెరుగైన న్యాయ సేవలు అందించాలి

Published: Tuesday January 03, 2023
 హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌
వికారాబాద్ బ్యూరో 02 జనవరి ప్రజాపాలన : పేద ప్రజలకు మెరుగైన న్యాయ సేవలందించేందుకు  జిల్లా న్యాయ సేవా సంస్థల సేవలును  ప్రారంభించినట్లు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 23 జిల్లాలలో న్యాయసేవా సంస్థలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ సోమవారం ఉదయం 9:30  గంటలకు వర్చువల్‌ విధానంలో లాంఛనంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా సోమవారం నుండి వికారాబాద్ జిల్లాలో  న్యాయ సేవా సంస్థ  ఏర్పాటు అయినట్లు జిల్లా ప్రిన్సిపాల్‌ సెషన్స్‌ జడ్జి, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ కే. సుదర్శన్ తెలిపారు. సామాన్య ప్రజలకు న్యాయ సేవలందించడం, లోక్‌ అదాలత్‌లను నిర్వహించి పేద ప్రజలకు ముఖ్యంగా మహిళలు, ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి ఉచిత న్యాయ సేవలందించేందుకు, అవసరమైతే న్యాయవాదిని ఏర్పాటు చేసి న్యాయ సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు.  న్యాయ సేవా సంస్థ యాక్ట్ 1987 లో అమలులోకి వచ్చిందని తెలిపారు.  ఈ చట్టం ద్వారా  ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించడం, లోక్ అదాలత్ సదస్సులను నిర్వహించి కేసులను సత్వరంగా పరిష్కరించడం జరుగుతుందన్నారు.  ప్రజలు జిల్లా న్యాయసేవా సంస్థ అందించే సేవలు వినియోగించుకోవాలని  సూచించారు.  జిల్లా సీనియర్ సివిల్ జడ్జి డి.బి. శీతల్ ను జిల్లా న్యాయ సేవ సంస్థ సెక్రటరీగా  జిల్లా జడ్జి చైర్మన్  సుదర్శన్  ఈ సందర్భంగా బాధ్యతలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో కె. శ్రీకాంత్  ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి, శృతి దూత అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి, జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, జిల్లా అదన కలెక్టర్ రాహుల్ శర్మ, వికారాబాద్ జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోకట్ మాధవరెడ్డి, అడ్వకేట్లు తదితరులు పాల్గొన్నారు.