ఐకెపి వివోఏల సమస్యలు పరిష్కరించాలి.

Published: Friday April 29, 2022
మంచిర్యాల టౌన్, ఏప్రిల్ 28, ప్రజాపాలన :  తెలంగాణ ఐకెపి, వివోఏ  ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి గురువారం రోజున వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో గ్రామస్థాయిలో 17,600 మంది వివోఏలు గ్రామ సహాయకులుగా పని చేస్తున్నారు. 15 సంవత్సరాల నుండి గ్రామాలలో మహిళల అభివృద్ధికి, మహిళా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేస్తూ మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి వారికి అవగాహన కల్పిస్తూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే లాగా ప్రోత్సహిస్తూ లోన్స్ ఇప్పిస్తూ తిరిగి సక్రమంగా నిర్వహణ చేస్తూ తిరిగి లోన్స్ చెల్లించే విధంగా ప్రోత్సహిస్తున్నారు. డ్వాక్రా మహిళా సంఘాలు నిర్వహిస్తున్న లావాదేవీలన్నీ పుస్తక నిర్వహణ చేస్తూ ఎస్.హేచ్.జి లైవ్ మీటింగ్ పెట్టి అన్ని సంఘాలు ఆన్లైన్లో ఎంటర్ చేస్తున్నారు. మహిళా సంఘాల పనులే కాకుండా ప్రభుత్వం చేపడుతున్న అన్ని రకాల సంక్షేమ పథకాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఎన్ని పనులు చేస్తున్న వివోఏ లకు ప్రభుత్వం ప్రస్తుతం మూడు వేల తొమ్మిది వందల రూపాయలు ఇస్తుంది. అది కూడా గ్రేడింగ్ పద్ధతి ద్వారా ఇస్తుంది. చాలీచాలని వేతనాలతో విఓఏ లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం స్పందించి వివోఏ ల సమస్యలు పరిష్కరించాలని లేని యెడల ఆందోళన కార్యక్రమాలు చేపడతామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివోఏల జిల్లా గౌరవ అధ్యక్షులు లింగంపల్లి వెంకటేష్, జిల్లా అధ్యక్షులు కుంటాల కుమార్, జిల్లా కార్యదర్శి జుమ్మిడి లక్ష్మణ్, జిల్లా కోశాధికారి దుర్గం రాములు, జిల్లా ఉపాధ్యక్షులు లింగన్న, దాసు జిల్లా సహాయ కార్యదర్శి ధర్మయ్య, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.