ఇష్టారాజ్యంగా పదవులు ప్రకటించుకుంటే చర్యలు తప్పవు

Published: Tuesday July 13, 2021
- కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్
మెట్ పల్లి, జూలై 12 (ప్రజాపాలన ప్రతినిధి) : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశాలు లేనిదే ఎవరికీ వారు పార్టీలో పదవులు ప్రకటించి ఉంటే పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆదివారం మెట్ పల్లిలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇటీవల కాలంలో పార్టీ అధిష్టానం కొత్తగా ఎవరికీ పదవులు జారీ చేయలేదని, ఎవరైనా తమకు పదవులు వచ్చినట్టు ప్రచారం చేసుకుంటే చర్యలు తీసుకుంటామని అన్నారు. పార్టీ అధిష్టానానికి కట్టుబడి పని చేసే నాయకులు, కార్యకర్తలకు భవిష్యత్తు ఉంటుందని అన్నారు. పార్టీని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసే కార్యకర్తలపై పీసీసీ ఆదేశాల మేరకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా కేంద్ర పెట్రోల్ డీజిల్ ధరలను ఇబ్బడిముబ్బడిగా పెంచడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నప్పటికీ ఆర్థిక పరిస్థితిని సాకు చూపుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలను తిప్పికొట్టడానికి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. 2023 ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు, దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ ఇలా అనేక విషయాలను అధికారంలోకి వచ్చిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు రివర్స్ పంపింగ్ ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు నీరివ్వకుండా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ జగిత్యాల జిల్లాను మోసం చేస్తున్నారన్నారు. అదేవిధంగా రైతుబంధు పేరిట రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందన్నారు. వరి ధాన్యం కొనుగోళ్లలో క్వింటాలుకు నాలుగు నుంచి ఐదు కిలోల చొప్పున తరుగు తీసేస్తున్నారని దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చ లేదన్నారు. ముత్యంపేట చక్కెర కర్మాగారం తెరిపిస్తామని హామీనిచ్చి దాన్ని శాశ్వతంగా మూసివేశరన్నారు. అదే విధంగా ధర్మపురి అర్వింద్ పసుపు బోర్డు తెస్తామని చెప్పి రైతులను మరోమారు మోసం చేశారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఎక్కడ అని ప్రశ్నించారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మెట్ పల్లి, కోరుట్ల పట్టణ అధ్యక్షులు తిరుమల గంగాధర్, మహ్మద్ ఖుతుబొద్దిన్ పాషా, నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు, యూత్ కాంగ్రెస్ ఇంచార్జి ఏలేటి మహిపాల్, నాయకులు నయిమ్, సోగ్రాభి, అక్బర్, వెంకటేష్, బెజ్జారపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.