దైవచింతనే మానవమనుగడకు మూలాధారం

Published: Monday April 18, 2022
వికారాబాద్ బ్యూరో 17 ఏప్రిల్ ప్రజాపాలన : హనుమాన్ జన్మదినోత్సవాన్ని అంగరంగవైభవంగా జనరంజకంగా నిర్వహించారు. శనివారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని ఆలంపల్లిలో గల వీరహనుమాన్ దేవాలయం నుండి శివరాంనగర్ లోని సంతోషిమాత దేవాలయం వరకు విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో హనుమాన్ చిత్ర పటాన్ని పుర వీధుల గుండా ఊరేగింపు తీశారు. ఊరేగింపులో భాగంగా వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ లు బ్యాండ్ వాయిస్తూ భక్తులను రంజింపజేశారు. విద్యార్థుల యోగచాప్ విన్యాసాలు కనురెప్పలు వాల్చనీయలేదు. వాయిద్యాలకు అనుగుణంగా యువత నృత్యాలు శోభాయాత్రను కనులకు ఇంపుగా మార్చాయి. జై శ్రీరాం, జై హనుమాన్ నినాదాలతో నగర వీధులన్నీ పులకించాయి. కాషాయ వర్ణశోభితమైన ఊరేగింపును చూడడానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి నయనానందం పొందారు. శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా నగర పోలీసు సిబ్బంది గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రశాంత వాతావరణంలో హనుమాన్ జన్మదిన వేడుకలు జరిగాయి.