బాల్య స్మృతులు మరువలేనివి

Published: Tuesday November 15, 2022
మన్నెగూడ ఎంపీటీసీ ఆదిల్
వికారాబాద్ బ్యూరో 14 నవంబర్ ప్రజా పాలన : బాల్య స్మృతులు మరువలేనివని అవి మన జీవితాంతము గుర్తుకు వస్తుంటాయని మన్నెగూడ ఎంపీటీసీ ఆదిల్ అన్నారు. సోమవారం మన్నెగూడ మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన బాలల దినోత్సవానికి ఎంపీటీసీ ఆదిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మన్నెగూడ ఎంపీటీసీ ఆదిల్ మాట్లాడుతూ అందరూ అనుభవించే బాల్యాన్ని భగవంతుడు ఇచ్చిన ఓ అమూల్యమైన వరం అని కొనియాడారు. అభం శుభం తెలియని పసి మనసుల పూతోటలో అప్పుడే పరిమళించిన పువ్వులు చిన్నారులేనని గత స్మృతులను గుర్తు చేసుకున్నారు. అందుకు సూచకంగా ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలలో బాలల దినోత్సవాన్ని జరుపుకుంటారని వివరించారు. మన దేశంలో ప్రతి సంవత్సరం నవంబరు 14 న బాలల దినోత్సవం జరుపుకుంటున్నామని చెప్పారు. భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం రోజున ఈ ఉత్సవం జరుగుతుందని గుర్తు చేశారు. నెహ్రూకు పిలల్లలతో వున్న బాంధవ్యాన్ని తెలుపుతూ ఈ ఉత్సవం జరుపుకుంటారని స్పష్టం చేశారు. పిల్లలు నెహ్రూను చాచా నెహ్రూ అని ప్రేమగా పిలిచేవారు. భారత తపాళా శాఖ ప్రతి సంవత్సరం ఈ రోజు తపాలా బిళ్ళను విడుదల చేస్తుంది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, తోటి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.