పట్ట భద్రుల ఎన్నికలకు రాజకీయ పార్టీలు సహకరించాలి: జిల్లా కలెక్టర్ పౌసుమి బసు

Published: Thursday February 18, 2021

వికారాబాద్ జిల్లా ప్రతినిధి 17 ( ప్రజాపాలన ) : పట్ట భద్రుల శాసన మండలి ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పౌసుమి బసు కోరారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 36 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, మోమిన్పేటలో వెయ్యి మంది ఓటర్లు దాటినందున ఒక ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాన్ని ప్రతిపాదించినట్లు తెలియజేశారు. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 23 వరకు నామినేషన్ ల స్వీకరణ, 24 న నామినేషన్ల పరిశీలన, 26 న నామినేషన్ల ఉపసంహారణ ఉంటుందన్నారు.  మార్చ్, 14 న ఉదయం 8.00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు పోలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు.  ఈ నెల 11 తర్వాత కోవిడ్ బారిన పడిన వారికి, వికలాంగులకు, 80 సంవత్సరాలు దాటిన వయో వృద్దులకు పోస్టల్ బాలెట్ సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు.  ఈ నెల 11 నుండి ఎన్నికల ప్రవర్తన నియమావలి అమలులోకి వచ్చినందున ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించకుండా జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా అందరు సహకరించాలని కోరారు.  సభలు సమావేశాలు నిర్వహించుకొనేందుకు గాను 48 గంటల ముందు జిల్లా ఎన్నికల అధికారికి అనుమతి కొరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇట్టి సమావేశాలలో కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు. రవాణా శాఖ ద్వారా అనుమతి పొందిన వాహనాలను మాత్రమే ప్రచారాలకు వినియోగించాలని తెలియజేశారు. ఓటర్లకు డబ్బులు, మద్యం లాంటి వాటితో ప్రలోభాలు పెట్టకూడదన్నారు.  ఓటు వేయాలని బలవంతం చేయకూడదని కులం మతం పేరుతో ఓట్లు అడగరాదని, మసీదులు, చర్చులు, మందిరాలలో సమావేశాలు నిర్వహించారాదని తెలిపారు. సమావేశాలలో  పార్టీ పరంగా తప్ప వ్యక్తిగత పరంగా, మత పరంగా దూషించారాదని సూచించారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే చట్ట పరంగా నాన్ బెయిల్ క్రిమినల్ కేసులు బుక్ చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్. పి. నారాయణ, జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్, ఎక్సజ్ సూపరింటెండెంట్ వరప్రసాద్ లతో పాటు  తెరాస, బీజేపీ, కాంగ్రెస్, వైస్సార్సీపీ, టీడీపీ, ఎం. ఐ. ఎం. సిపిఎం. పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.