రైతాంగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న మోడీ సర్కారుపై పోరాటానికి సిద్ధం కావాలి --తీగల సాగర

Published: Wednesday November 23, 2022
చౌటుప్పల్, నవంబర్ 22 (ప్రజాపాలన ప్రతినిధి): కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాలతో రైతులు దివాళా తీస్తున్నారని,రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న ప్రభుత్వాలు ఖర్చులను రెట్టింపు చేస్తున్నాయని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ అన్నారు.మంగళవారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని పద్మశ్రీ ఫంక్షన్ హాల్లో జిల్లా అధ్యక్షుడు మేక జగన్ రెడ్డి అధ్యక్షతన యాదాద్రి భువనగిరి జిల్లా రైతుసంఘం ద్వితీయ మహాసభలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న తీగల సాగర్ మాట్లాడుతూ దేశంలో సంపన్నులకు 11 లక్షల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేసిన మోడీ సర్కార్ 16 కోట్ల మంది రైతులకు 8 లక్షల రూపాయలు రుణాలు అందించలేకపోతుందని విమర్శించారు.దేశానికి అన్నంపెట్టే రైతన్నలను యాచకులుగా మారుస్తున్నారని మండి పడ్డారు.రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి రైతులకు ఉరితాడు వేసి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పజెప్పే కుట్రను తిప్పికొట్టాలన్నారు.పండించిన పంటకు కనీస మద్దతుదరకు పార్లమెంటులో గ్యారంటీ చట్టం అమలు చేయాలన్నారు.
    మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి మాట్లాడుతూ యాదాద్రి జిల్లాలో పేరుకుపోయిన రైతాంగ సమస్యలు పరిష్కరించాలని అన్నారు.బస్వాపురం ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు ప్రత్యామ్నాయంగా భూములు కొనివ్వాలని డిమాండ్ చేశారు.చిన్న నీటి వనరులైన పిలాయిపల్లి,ధర్మారెడ్డి,బునాదిగాని కాల్వలో భూములుకోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని అన్నారు.
పోడు భూములకు పాస్ పుస్తకాలు ఇవ్వాలని, రీజినల్ రింగ్ రోడ్ లో భూములు కోల్పోయిన రైతులకు మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం చెల్లించాలన్నారు. 
ఈ మహాసభలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు బొంతల చంద్రారెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాటూరి బాలరాజు గౌడ్, నాయకులు మంగ శ్రీనివాస్, చీరిక అలువేలు,బూర్గు కృష్ణారెడ్డి, చీరిక సంజీవరెడ్డి, నర్సిరెడ్డి, గంగాదేవి సైదులు,గునుగుంట్ల శ్రీనివాస్, బోయిని ఆనంద్, గూడూరు అంజిరెడ్డి, కందటి సత్తిరెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.