హైకోర్టు ఆర్డర్ ప్రకారం వరద బాధితులకు, పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చి పట్టాలు ఇవ్వాలి.... సిపిఐ ఎంఎ

Published: Wednesday January 04, 2023
బూర్గంపాడు ( ప్రజా పాలన.)
గత ఐదు నెలలుగా ఇంటి స్థలాల కోసం వరద బాధితులు, పేదలు కొనసాగిస్తున్న ఆందోళనను ప్రభుత్వం పట్టించుకోకుండా పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని, హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం 437/1 ప్రభుత్వ భూమిలో ఇంటి స్థలాలు కేటాయించి, పట్టాలు ఇవ్వాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం 143వ రోజు వరద బాధితుల ఆందోళన శిబిరాన్ని సందర్శించిన సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి మోరా రవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆవునూరి మధు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ వరద బాధితులకు తక్షణ ఆర్థిక సహాయం 10000, ప్రత్యేక ప్యాకేజీ 1000 కోట్లు ప్రకటించి, మెరక ప్రాంతంలో స్థలం సేకరించి, డబల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ఆరు నెలలు కావస్తున్నప్పటికి ఇంతవరకు చర్యలు చేపట్టలేదని అన్నారు. బాధితులు, పేదలందరూ అప్పటినుండి ఇప్పటిదాకా ఆందోళన శిబిరంలో దీక్షలు కొనసాగిస్తూ, 437/1 సర్వేనెంబర్ ప్రభుత్వ భూమిలో గుడిసెలు నిర్మించుకొని ఉంటున్న క్రమంలో, ఫారెస్ట్ అధికారులు, ప్రభుత్వం బాధితులకు, స్థానిక ప్రజల మధ్య ఘర్షణలు సృష్టించి, శాంతి భద్రతల సమస్యగా చూపి, బాధితులను, పేదలను వెల్లగొట్టడానికి పథకం పన్నారని పేర్కొన్నారు. అయినప్పటికీ హైకోర్టు జడ్జిమెంట్ ఆధారంగా, ప్రజల మధ్య వైశమ్యాలకు తావు లేకుండా హైకోర్టు తీర్పును అమలు చేయాల్సిన బాధ్యత జిల్లా ఉన్నతాధికారులపై ఉన్నదని తెలిపారు. వెంటనే జిల్లా అధికార యంత్రాంగం స్పందించి వరద బాధితులకు, పేదలకు ఇంటి స్థలాలు కేటాయించి, పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు జిల్లా కార్యదర్శి కందగట్ల సురేందర్, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు కుంజా కృష్ణ, బండ్ల వెంకటేశ్వర్లు, ఐ ఎఫ్ టి యు మణుగూరు ఏరియా అధ్యక్షులు మలికంటి రాము, నాయకులు వైఎస్ రెడ్డి, పొనగంటి వెంకన్న, ఆర్ లక్ష్మి, కుంజ భద్రమ్మ, జీనత్, మంగీలాల్, కృష్ణవేణి, వెంకటమ్మ, సునీత తదితరులు పాల్గొన్నారు.