టిఆర్ఎస్ గూటికి చేరనున్న టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి

Published: Thursday July 15, 2021
వికారాబాద్ జూలై 14 ప్రజాపాలన బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో టిడిపికి భవిష్యత్తు లేకపోవడంతో టిడిపేతర పార్టీల వైపు దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. అధికార టిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు తమ అనుచరగణంతో సమాలోచనలు జరుపుతున్నారు. అందులో భాగంగానే రాష్ట్ర తెలుగు దేశం అధ్యక్షుడు ఎల్.రమణ త్వరలో టిఆర్ఎస్ కండువా కప్పుకోనున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్రంలో టిడిపి పగ్గాలు పట్టి నడపాల్సిన వ్యక్తే పార్టీ మారబోతున్నారనే విషయాన్ని తెలుసుకున్న కార్యకర్తల ఆలోచనలు కూడా మారాయి. తమ నాయకునితో పాటు మేము ఉంటామని ధీమా వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. వికారాబాద్ జిల్లాలో మోమిన్ పేట్ మండల పరిధిలో గల కోలుకుంద గ్రామానికి చెందిన టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి కరణం రామకృష్ణ త్వరలో టిఆర్ఎస్ గూటికి చేరనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో మోమిన్ పేట్ మండలం తెలుగు దేశానికి కంచుకోటలా నిలిచింది. కానీ, స్వరాష్ట్రం సాధించుకున్న తరువాత టిడిపికి బీటలు పారడం మొదలయ్యాయి. తమ నాయకుడు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ అడుగు జాడల్లో నడవనున్నామని కరణం రామకృష్ణ బుధవారం ప్రజాపాలన బ్యూరో రిపోర్టర్ తో చరవాణి ద్వారా తెలిపారు. కోలుకుంద గ్రామానికి చెందిన సర్పంచ్ కరణం పార్వతమ్మ, ఎంపిటిసి శ్రీదేవి, కొత్తకోలుకుంద గ్రామ సర్పంచ్ కొనింటి సురేష్ లతో కలిసి త్వరలో టిఆర్ఎస్ గూటికి చేరనున్నామని పేర్కొన్నారు.