జనవరిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ

Published: Friday November 25, 2022
రోడ్లు భవనాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 24 నవంబర్ ప్రజా పాలన : రాష్ట్ర వ్యాప్తంగా  డబుల్ బెడ్ రూం ఇండ్లను 2023 జనవరి 15 నాటికి లబ్ధిదారులకు పంపిణీకి సిద్ధం చేయాలని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుండి అయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, రాష్ట్ర ఉన్నత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించి, రెండు పడక గదుల గృహ నిర్మాణం పురోగతి, పోడు భూములు, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, బృహత్ ప్రకృతి వనాలు, తదితర అంశాల పై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 
 డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి పేద ప్రజలు ఆత్మగౌరవంతో జీవించేలా వంద శాతం సబ్సిడీతో పంపీణి చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రాజెక్టు ను రూపొందించారని తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో మార్గదర్శకాల ప్రకారం జిల్లా కలెక్టర్ లు వారి పరిధిలో నిర్మాణం పూర్తయిన, తుది దశలో ఉన్న ఇండ్లకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని మంత్రి సూచించారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించిన గ్రామం, పట్టణ పరిధిలో అధిక సంఖ్యలో అర్హులైన లబ్దిదారులకు ఉన్న నేపథ్యంలో  లాటరీ పద్ధతి ద్వారా పారదర్శకంగా ఎంపిక చేయాలని, మిగిలిన అర్హులు వివరాలతో వెయిటింగ్ లిస్టు జాబితా తయారు చేయాలని మంత్రి సూచించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక, పూర్తయిన ఇండ్ల పంపిణీ క్షేత్ర స్థాయిలో సమాంతరంగా జరగాలని మంత్రి అధికారులకు సూచించారు. రెండు పడక గదుల ఇండ్ల పంపిణీ పూర్తయిన లబ్ధిదారుల వివరాలు ప్రభుత్వ పోర్టల్ లో నమోదు చేయాలని కలెక్టర్ లకు సూచించారు. డబుల్ బెడ్ రూం ఇండ్లకు త్రాగునీటి సరఫరా, డ్రైనేజీ, విద్యుత్ కనెక్షన్ వంటి మౌళిక వసతుల కల్పనకు రూ.205 కోట్లు మంజూరు చేశామని, నిధులను వినియోగించుకుంటూ మౌళిక వసతుల కల్పన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్లకు సూచించారు. 18 వేల కోట్ల ప్రాజెక్టులో భాగంగా ఇప్పటి వరకు 11,990  కోట్ల రూపాయల బిల్లులు చెల్లించామని, నిధులకు ఎలాంటి కొరత లేదని, రాష్ట్ర వ్యాప్తంగా తుది దశ నిర్మాణంలో ఉన్న 40 వేల రెండు పడక గదుల ఇండ్లు వేగవంతంగా పూర్తి జరిగేలా కలెక్టర్లు పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు.  డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పురోగతిని కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ వేగం పెంచాలని, ప్రతి వారం పురోగతిపై సమీక్ష నిర్వహిస్తామని , జనవరి 15 నాటికి లబ్ధిదారులకు పంపిణీకి సిద్ధం  చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేష్ కుమార్ మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక, తుది దశలో ఉన్న ఇండ్ల నిర్మాణం, మౌళిక వసతుల కల్పన వంటి అంశాల పై జిల్లాకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుని అమలు చేయాలని అయన సూచించారు. జిల్లాలో పంపిణీకి సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకొని తేదీ నిర్ణయించుకొని పంపిణికి సిద్ధం చేయాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ జిల్లాలో 3800 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరైనవని, 1026 డబల్ బెడ్ రూమ్ పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయని, మరో 1251 ఇండ్ల పనులు వివిధ దశలలో పురోగతిలో ఉన్నాయని వీటిని వేగవంతంగా పూర్తి చేసేందుకు ప్రతిరోజు పనులను పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారంతో పూర్తి చేయనున్నట్లు కలెక్టర్ తెలియజేశారు.   జిఓ 58, 59 క్రింద 869 దరఖాస్తులు రాగా ఈరోజు స్క్రుటనీ పనులు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. పెండింగ్ లో ఉన్న ధరణి కేసుల పరిష్కారం వారం రోజులలో పూర్తి చేయడం జరుగుతుందన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ ,జిల్లా రెవిన్యూ అధికారి అశోక్ కుమార్, ఆర్డీవో విజయకుమారి,
 డి ఆర్ డి ఓ కృష్ణన్, గిరిజన సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ కళ్యాణ్ రెడ్డి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కోటాజి, జిల్లా పంచాయతీ అధికారి మల్లారెడ్డి, వివిధ శాఖల  ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.