రైతులకు కంది విత్తనాలు ఉచితంగా ప్రభుత్వమే పంపిణీ చేస్తుంది

Published: Friday June 24, 2022
 వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో జూన్ 23 ప్రజాపాలన : రైతులకు కంది విత్తనాలను ప్రభుత్వమే ఉచితంగా పంపిణీ చేస్తుందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. గురువారం వికారాబాద్ మండల పరిధిలోని మైలారం గ్రామంలో  గ్రామ సర్పంచ్ కొంపల్లి భారతమ్మ నర్సింలు కార్యదర్శి జ్ఞానేశ్వర్ లతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ *"మీతో నేను"* కార్యక్రమంలో భాగంగా ఉదయం 6:30 గంటల నుండి 10:30 వరకు పర్యటించారు.
గ్రామంలో నీరు రోడ్లపై పారడంతో మురుగు కాలువల నిర్మాణానికి కృషి చేద్దామన్నారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించుకొని వాటిని వాడుకలో ఉంచాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ప్రమాదవశాత్తు మరణిస్తే  *రైతు భీమా* కల్పిస్తుందని స్పష్టం చేశారు. రైతు భీమాకు దరఖాస్తు చేసుకోలేని రైతులు ఇంకా ఎవరైనా ఉంటే మరియు కొత్త పాస్ పుస్తకాలు వచ్చినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అందుకు రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.  గ్రామంలో అవసరమైన వీధులలో కొత్త స్తంభాలు ఏర్పాటు చేసి, గ్రామంలో మరియు పంటపొలాల్లో వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయాలని, లో ఓల్టేజ్ సమస్య ఉండటంతో 25కెవి నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి ఎలాంటి అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ మంచినీటి నల్లా కనెక్షన్ ప్రతీ ఇంటికి కచ్చితంగా ఇవ్వాలని, లీకేజీలు లేకుండా ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ... సురక్షిత మంచి నీటి సరఫరా చేయాలని ఆదేశించారు. ప్రజలు సురక్షితమైన మిషన్ భగీరథ మంచి నీటిని త్రాగాలని సూచించారు. ప్రతి గ్రామంలో రైతులకు కంది విత్తనాల మిని కిట్స్ పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ వారిని ఆదేశించారు. రైతులకు కంది విత్తనాలు ఉచితంగా ప్రభుత్వమే పంపిణీ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ మల్గ సత్తయ్య, ఎంపిఓ నాగరాజు, మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ గయాజ్ మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు ఎర్రవల్లి రవీందర్ మండల టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సత్తయ్య గౌడ్ వికారాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పాప గారి విజయ్ కుమార్ రేషన్ డీలర్ మాణిక్ రెడ్డి ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు.