ఓం నమః శివాయ..! శివనామస్మరణతో మార్మోగిన గోదావరి తీరం. .. ఉపవాసం పాటించి శివాలయాల్లో పూజలు చేసిన

Published: Monday February 20, 2023
( ఓం నమః శివాయ..! ఇది మహా శివుడిని స్మరించే గొప్ప మంత్రం. సృష్టిలో ముఖ్యమైన దేవుళ్లైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఒకడైన అత్యంత శక్తివంతమైన దేవుడు మహా శివుడు. ఓం నమః శివాయ అనే మంత్రం శివుడికి చాలా ప్రత్యేకమైనది. హిందువులకు ముఖ్యమైన దేవుడు శివుడు. శివ భక్తులు ఎప్పుడూ ఆ పరమేశ్వరుడిని ఓం నమః శివాయ అనే మంత్రం ద్వారా స్మరిస్తూ ఉంటారు. )
 
మంచిర్యాల బ్యూరో, ఫిబ్రవరి 18, ప్రజాపాలన:
 
జిల్లాలో శివాలయాల్లో పంచాక్షరీ మంత్ర పఠనంతో  మార్మోగాయి. శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని పరమేశ్వరుడి దర్శనం కోసం ప్రముఖ శైవ క్షేత్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసారు.  జిల్లాలో ప్రసిద్ధిగాంచిన వేలాల మల్లన్న ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారు జాము నుంచే భక్తులు గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి శివాలయాల్లో భక్తులు క్యూ కట్టారు.
జాతరలో భాగంగా స్వామి వారి కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే మల్లన్న ఆలయంలో ఏటా మహా శివరాత్రి పర్వదినాన శివ పార్వతుల కళ్యాణం జరిపిస్తారు. మూడు రోజుల పాటు ఇక్కడ జాతర నిర్వహిస్తారు. జిల్లా లోని శైవక్షేత్రాలలో భక్తులు భారీగా శివపార్వతుల ను దర్శించుకుంటున్నారు. జిన్నారం మండలంలోని తపాలపూర్ లోని శివాలయంలో   భక్తులు పోటెత్తారు.అదేవిదంగా ప్రముఖ ఆలయాల్లో సాధారణ భక్తులతో పాటుగా వీఐపీల తాకిడి పెరిగింది.
 
 * గోదావరి తీరంలో బక్తులు రద్దీ
 
జిల్లాలో ని గోదావరి తీరప్రాంతంలో పుణ్య స్నానాలకోసం వచ్చిన భక్తులతో గోదావరి రేవులు, స్నానఘట్టాలు కిటకిటలాడాయి.
శివసత్తుల పూనకాలు, ఇసుకతో శివ లింగాలు ఏర్పాటు చేసి భక్తిశ్రద్ధలతో పూజించటం ప్రత్యేకత గా చెప్పుకోవచ్చు.  అదేవిదంగా  ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, యువ నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ లు, మంచిర్యాల మున్సిపాలిటీకి చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి గోదావరి పుష్కర ఘాట్ ను పరివేక్షించారు. గోదావరిలో స్నానం ఆచరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చిన నేపథ్యంలో, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.బక్తులకు  నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ అద్వర్యం లో మజ్జిగ పంపిణీ చేశారు. తిమ్మాపూర్ గ్రామంలో ని గోదావరి రేవువద్ద గ్రామ సర్పంచ్ జాడీ గంగాధర్ అల్పాహారం, అరటిపండు అందజేశారు.
 
* జాగారం పాటించి నా శివభక్తులు
 

శివారాధనలో లింగరూపంలో పూజించటం , అదేవిధంగా ప్రతి లింగంలోనూ శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుందని నమ్మకంతో ఉంటారు . వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్రధానమైనవి. అభిషేకాలు , పూజలతో పరమశివుని ఆరాధించారు.  రాత్రి పూట దేవాలయాలు తెరిచే ఉంచారు.దీంతో ఆలయాలు పూజలు , భజనలతో శివనామం మారుమోగాయి.. ఈ పర్వదినాన లింగాష్టకం, శివ పంచాక్షరి జపించారు. దీపారాధన చేసి , భక్తిప్రపత్తులతో రుద్రాభిషేకం చేశారు. శివపార్వతుల కల్యాణం చేశారు. రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో చింతనలో గడిపి రాత్రి జాగారం చేసి. శివరాత్రి పర్వదినానికి ఉపవాసం, జాగారం పాటించారు..