పరీక్షలు రద్దు చేయాలంటూ విద్యార్థుల ర్యాలీ

Published: Tuesday October 05, 2021
సిలబస్ పూర్తి చేయకుండా పరీక్షలు ఎలా పెడతారన్న ఎస్ఎఫ్ఐ
మంచిర్యాల బ్యూరో, అక్టోబర్ 4, ప్రజాపాలన : ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేయాలంటూ ఎస్ఎఫ్ఐ ఆద్వర్యంలో సోమవారం విద్యార్థులు లక్షెట్టిపేట పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ నుండి ఉత్కూర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జాతీయ రహదారి పైన మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా అక్టోబర్ 25వ నుండి ఇంటర్మీడియట్ విద్యార్థులకు మొదటి సంవత్సరం పరీక్ష నిర్వహించాలని ఇంటర్ బోర్డు టైంటేబుల్ విడుదల చేసిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత 18 నెలలుగా కరోనా తీవ్ర రూపంలో విజృంభించిందని, ఫలితంగా రాష్ట్రంలో విద్యాసంస్థలు మూతపడ్డాయి కాబట్టి పాఠాలు చెప్పకుండా పరిక్షలు ఏలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. పోయినేడు విద్యార్థులు పరీక్షలు నిర్వహించడానికి అవకాశం లేకపోవడంతో 2019-2020 విద్యా సంవత్సరం విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం ప్రమోట్ చేసిందని గుర్తుచేశారు. అదేవిధంగా 2020-2021 విద్యా సంవత్సరం కూడా పదవ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులను ప్రమోట్ చేశారని ఐతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మార్చుకొని కార్పొరేట్ కళాశాలల కోసం పరీక్షలు సిద్ధం చేస్తుందని విమర్శించారు. అదేవిధంగా 18 నెలల కాలంలో ప్రభుత్వ కాలేజీల్లో 1700 గేస్ట్ లెక్చరర్ పోస్టులు రెన్యూవల్ చేయలేదని,. దింతో ప్రభుత్వ కాలేజీల్లో ఆన్లైన్ లో కూడా తరగతులు జరగలేదని అన్నారు. లెక్చరర్ లేక పాఠాలు జరగక టీవీ పాఠాలు అర్థం కాక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు.. కరోనా తీవ్రత తగ్గడంతో మళ్ళీ విద్యాసంస్థల ప్రారంభం అయ్యాయని,. కానీ ప్రభుత్వ  సంక్షేమ హాస్టల్స్, గురుకులాలు ప్రారంభం కాలేదన్నారు. కార్పొరేట్ కాలేజీలకు ర్యాంకుల ప్రచారం చేసుకొని, వారి వ్యాపార సామ్రాజ్యం పెంచుకోవడం తప్ప పరీక్షలు దేనికి ఉపయోగపడవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అజయ్, చిన్న, రాకేష్, మనోజ్, స్వాతి, సుప్రియ, పల్లవి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.