పోరాటాల ద్వారానే పేదల భూములు దక్కుతాయి

Published: Tuesday May 17, 2022
....అభివృద్ధి పేరుతో జన్నారం పేద రైతుల భూములు తీసుకోవద్దు
 
....సిపిఐ (ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భూక్యా వీరభద్రం
 
 ...ఏన్కూర్ రెవెన్యూ అధికారులకు రైతుల వినతి.
 
 
ఏన్కూర్ మండలం జన్నారం గ్రామ పంచాయతీ పరిధిలో అనేక సంవత్సరాల నుండి బడుగు బలహీన వర్గాలకు చెందిన పేద రైతులు సాగు చేసుకుంటున్న భూములను అభివృద్ధి పేరుతో, పంచ రాయి భూముల పేరుతో ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనే ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రామ రైతులు ప్రజా ప్రతినిధులు, రాజకీయ పక్షాలతో కలిసి తాసిల్దార్ కార్యాలయంకు చేరుకొని ఏన్కూర్ ఇన్చార్జి తాసిల్దార్ నరేష్ కు వినతి పత్రాన్ని అందజేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులకు తెలియకుండా సర్వేల పేరుతో రెవెన్యూ అధికారులు సాగు భూముల మీదకు రావడం వలన రైతులు గందరగోళం పెడుతున్నారని, తమ జీవనాధారం అయిన భూములను స్వాధీనం చేసుకుంటుందని తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భూక్యా వీరభద్రం మాట్లాడుతూ పది, ఇరవై కుంటలు, ఎకరం, అర ఎకరం ఉన్న నిరుపేదల భూములను అభివృద్ధి పేరుతో ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేద రైతుల పొట్టలు కొట్టవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం, అధికారులు జన్నారం పంచ రాయి భూముల జోలికి వస్తె పోరాటం తప్పదని హెచ్చరించారు. అనంతరం ఇన్చార్జి తాసిల్దార్ నరేష్ మాట్లాడుతూ స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులకు తెలియకుండా భూములను సర్వే చేయమని, వినతి పత్రంలో రైతులు పేర్కొన్న డిమాండ్లను జిల్లా కలెక్టర్, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జన్నారం గ్రామం సర్పంచ్ ధరావత్ పద్మ, ఉప సర్పంచ్ అడపా రామారావు, గార్లఒడ్డు సోసైటీ వైస్ చైర్మన్ రేగళ్ల తిరుమలరావు, సొసైటీ డైరెక్టర్ పి. నరసింహారావు, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు భానోత్ బాలాజీ, తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు, సిపిఐ(ఎం) ఏన్కూర్ మండల కార్యదర్శి దోంతబోయిన నాగేశ్వరరావు, ఏర్పుల రాములు, అరికాయలపాడు ఉప సర్పంచ్ గుడ్ల వెంకటేశ్వరరావు, రేగళ్ళ నాగయ్య, స్వర్ణ కృష్ణయ్య, గుడిమెట్ల మోహన్ రావు, రాయల నరసింహారావు, కొమ్మూరి వెంకటేశ్వర్లు, ప్రసాద్, లక్ష్మయ్య, నరసింహారావు, హరీష్ తదితరులు పాల్గొన్నారు.