రావులపల్లి గ్రామం అభివృద్ధే లక్ష్యం

Published: Tuesday July 05, 2022
 సర్పంచ్ దేవమ్మ అబ్రహం
వికారాబాద్ బ్యూరో జూలై 04 ప్రజా పాలన : గ్రామాభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తున్నామని రావులపల్లి గ్రామ సర్పంచ్ దేవమ్మ అబ్రహం అన్నారు. పచ్చ అందాల హరివిల్లుగా తయారు చేయుటకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. మర్పల్లి మండల పరిధిలోని రావులపల్లి గ్రామంలో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థ చేపట్టినటువంటి హరిత గ్రామ కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ దేవమ్మ అబ్రహం ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి స్వప్నతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సర్పంచ్ దేవమ్మ అబ్రహం మాట్లాడుతూ గ్రామ పరిధిలో మొక్కలు నాటుటకు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థ రెండు సంవత్సరాలుగా మొక్కలను అందివ్వడం అభినందనీయమని కొనియాడారు. ఈ సంవత్సరానికి గాను 2000 మొక్కలను సంవత్సరం నుండి రెండు సంవత్సరాల వయసు గల మొక్కలను అందించారని గుర్తు చేశారు. అలాగే ఒక్కొక్క ఇంటికి ఒక పూల మొక్క ఒక కరివేపాకు మరియు నిమ్మ మొక్కలను కలిపి మూడు మొక్కల చొప్పున అందించనున్నామని స్పష్టం చేశారు. రోడ్డుకు ఇరువైపులా నాటడానికి పెద్ద మొక్కలు ఇచ్చారని తెలిపారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థ అధ్యక్షురాలు లీలా లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు స్థానిక మొక్కలు అయినటువంటి మర్రి రావి జువ్వి వేప మొదలగు వృక్షజాతులను అందించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గత సంవత్సరము నాటినటువంటి మొక్కలను సంస్థ ప్రతినిధులు చూడడం జరిగిందని అన్నారు. గత సంవత్సరం నాటినటువంటి మొక్కలతో చిన్నపాటి అడవిని తలపించినట్టుగా ఉంది అని గ్రామపంచాయతీ కార్యవర్గానికి పేరుపేరునా అభినందనలు తెలిపారు. సర్పంచ్ దేవమ్మ అబ్రహం కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థకు కృతజ్ఞతలు చెప్పామన్నారు. గ్రామ సుస్థిర అభివృద్ధి కొరకై తోడ్పాటుకు గ్రామస్తులు అందరూ కలిసి పనిచేయాలని సంస్థ ప్రతినిధులు తెలియజేశారు. ఈసీ విఠల్, టి ఏ భాస్కర్ గ్రామస్తులు పాల్గొన్నారు.